India vs England: 4వ టెస్ట్.. వర్షం పడుతుందా? పిచ్ రిపోర్ట్, ప్రివ్యూ, ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే?
ఆటగాళ్ల గాయాలు భారత్‌ను తీవ్రంగా బాధిస్తున్నాయి. మరోవైపు, రెండో, నాలుగో రోజు వర్షం పడే అవకాశం ఉంది.

ఇంగ్లాండ్ టూర్‌లో అత్యంత కీలకమైన నాలుగో టెస్ట్ మ్యాచ్ జూలై 23న మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచును జియో యూజర్లు JioCinema, JioTVలో ఉచితంగా చూడొచ్చు.
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. భారత్ నాలుగో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలనుకుంటోంది. ఈ మ్యాచులో ఓడిపోతే భారత్ సిరీస్‌ను కోల్పోతుంది. తుది జట్టు ఎంపికలో భారత్ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.
ఆటగాళ్ల గాయాలు భారత్‌ను తీవ్రంగా బాధిస్తున్నాయి. ముఖ్యంగా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మోకాలి గాయంతో టోర్నీకి దూరం కావడం భారత్‌పై ప్రభావం చూపనుంది. భారత్ జట్టు కూర్పులో మార్పులకు సిద్ధమవుతుంది. శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్ లాంటి ఆటగాళ్లు ప్రత్యామ్నాయంగా వస్తున్నారు.
మిడ్ ఆర్డర్‌లో నిలకడ ఉంటుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కరుణ్ నాయర్, సాయి సుదర్శన్‌లో ఎవరిని తీసుకుంటారన్న విషయంపై అస్పష్టత ఉంది. ఆకాశ్ దీప్ కూడా గాయం కారణంగా జట్టులో ఆడతాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అతడు ఆడకపోతే అన్షుల్ కంబోజ్ లేదా ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం ఉండొచ్చు.
ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికే జట్టును ప్రకటించింది. జట్లులో జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), జోఫ్రా ఆర్చర్, లియమ్ డాసన్, బ్రైడన్ కార్స్, క్రిస్ వోక్స్ ఉన్నారు. భారత్ తుది జట్టు ఎంపిక కీలకంగా మారనుంది. వికెట్, వాతావరణ పరిస్థితుల ప్రకారం సర్దుబాటు చేసుకుని టీమిండియా బరిలోకి దిగనుంది.
ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం తొలి రెండు రోజులపాటు పేసర్లకు అనుకూలంగా ఉండొచ్చు. రెండో, నాలుగో రోజు వర్షం పడే అవకాశం ఉంది.
టెస్టుల్లో ఎవరిది పైచేయి?
భారత్, ఇంగ్లాండ్ మధ్య ఇప్పటివరకు మొత్తం 139 టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో ఇంగ్లాండ్ 53 మ్యాచ్‌లను గెలవగా, భారత్ 36 టెస్టుల్లో విజయం సాధించింది. మిగిలిన 50 టెస్టులు డ్రాగా ముగిశాయి. ఈ గణాంకాలు రెండు జట్ల మధ్య జరిగే మ్యాచు ఎంతటి ఉత్కంఠభరితంగా ఉంటుందో స్పష్టం చేస్తాయి.
లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ వివరాలు
టీవీ బ్రాడ్‌కాస్ట్ (భారత్): Sports18
డిజిటల్ స్ట్రీమింగ్: JioCinema, JioTV (Jio యూజర్లకు ఉచితం)
ఇంగ్లాండ్‌లో: Sky Sports Cricket
మ్యాచ్ ప్రారంభ సమయం: మధ్యాహ్నం 3.30 గంటలకు
టాస్: మధ్యాహ్నం 3 గంటలకు