Under-19 World Cup : అండర్-19 ప్రపంచకప్ ఫైనల్స్‌లో టీమ్ఇండియా ట్రాక్ రికార్డు ఇదే..

ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రుగుతున్న అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ ఆఖ‌రి అంకానికి చేరుకుంది.

India's Record In Under-19 World Cup Finals

Under-19 World Cup Finals : ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రుగుతున్న అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ ఆఖ‌రి అంకానికి చేరుకుంది. ఆదివారం బెనోనిలో విల్లోమూర్ పార్క్‌లో అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచులో భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఉద‌య్ స‌హార‌న్ నేతృత్వంలో భార‌త జ‌ట్టు బ‌రిలోకి దిగ‌నుంది. ఈ టోర్నీలో టీమ్ఇండియా ఫైన‌ల్‌కు చేరుకోవ‌డం ఇది తొమ్మిదో సారి. వ‌రుస‌గా ఐదోసారి. ఇప్ప‌టి వ‌ర‌కు ఎనిమిది సార్లు ఫైన‌ల్ మ్యాచులు ఆడ‌గా ఐదు మ్యాచుల్లో గెలిచింది. మ‌రో మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. ఈ టోర్నీ చ‌రిత్ర‌లో అత్యంత విజ‌య‌వంత‌మైన జ‌ట్టుగా భార‌త్ నిలిచింది.

అండ‌ర్ -19 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త ప్ర‌ద‌ర్శ‌న‌ను ఓ సారి చూద్దాం..

2000 : అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా ఫైన‌ల్‌కు చేరుకోవ‌డం ఇదే మొద‌టి సారి. కొలంబో వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో మ‌హ్మ‌ద్ కైఫ్ నాయ‌క‌త్వంలోని భార‌త్ బ‌రిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 178 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ల‌క్ష్యాన్ని భార‌త్ 40.4 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి ఛేదించి తొలిసారి క‌ప్పును ముద్దాడింది. ఈ జ‌ట్టులో ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ కూడా స‌భ్యుడు.

2006 : ఈ టోర్నీలో భారత్‌ ఫైన‌ల్ చేరుకోవ‌డం ఇది రెండోసారి. కొలంబో వేదిక‌గా పాకిస్తాన్‌తో త‌ల‌ప‌డింది. లోస్కోరింగ్ మ్యాచ్‌లో భార‌త్ 38 ప‌రుగుల తేడాతో పాక్ చేతిలో ఓడిపోయింది. రోహిత్ శర్మ, ఛెతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజా, పీయూష్ చావ్లా వంటి ఆట‌గాళ్ల ఉన్న టీమ్ఇండియాకు రవికాంత్ శుక్లా కెప్టెన్‌గా వ్య‌హ‌రించాడు. ఈ మ్యాచ్‌లో పాక్ తొలుత బ్యాటింగ్ చేసి 109 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ల‌క్ష్య ఛేద‌న‌లో భారత్‌ 71 పరుగులకే కుప్ప‌కూలింది.

Shamar Joseph : వెస్టిండీస్ న‌యా సంచ‌ల‌నానికి బంఫ‌ర్ ఆఫ‌ర్‌.. ఐపీఎల్‌లో ఎంట్రీ.. రూ.3కోట్ల‌కు డీల్‌

2008 : అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌లోకి ప్రవేశించడం ఇది మూడోసారి. విరాట్ కోహ్లీ నాయ‌క‌త్వంలో కౌలాలంపూర్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్‌లో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో 12 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ 159 ప‌రుగులు చేసింది. అనంత‌రం ద‌క్షిణాఫ్రికా 8 వికెట్లు కోల్పోయి 103 ప‌రుగుల‌కే ప‌రిమితమైంది. సౌరభ్ తివారీ, మనీష్ పాండే, రవీంద్ర జడేజా, సిద్దార్థ్ కౌల్ వంటి ఆట‌గాళ్లు ఈ జ‌ట్టులో ఉన్నారు.

2012 : ఆస్ట్రేలియాను ఓడించి మూడోసారి భార‌త్ ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడింది. టౌన్స్‌విల్లేలో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 225 ప‌రుగులు చేసింది. కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ 111 ప‌రుగుల‌తో అజేయంగా నిల‌వ‌డంతో ల‌క్ష్యాన్ని భార‌త్ 47.4 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గెలిచిన భారత జట్టులో హనుమ విహారి, సందీప్ శర్మ లు ఉన్నారు.

2016 : ఈ ఎడిషన్ నుండి భార‌త్‌ ఇప్పటి వరకు అండర్-19 ప్రపంచకప్‌లో వరుసగా ఫైనల్‌కు చేరుకుంది. మిర్పూర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ నాయ‌క‌త్వంలోని భార‌త్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. 145 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ల‌క్ష్యాన్ని విండీస్ 49.3 ఓవర్లలో ఛేదించింది. రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, సర్ఫరాజ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్ వంటి ఆట‌గాళ్లు ఉన్న‌ప్ప‌టికీ భార‌త్ ఓడిపోయింది.

2018 : ఆస్ట్రేలియాతో రెండోసారి భార‌త జ‌ట్టు ఫైన‌ల్ మ్యాచులో త‌ల‌ప‌డింది. మౌంట్ మౌంగానుయ్ వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 216 ప‌రుగుల‌కు ఆలౌటైంది. పృథ్వీ షా నేతృత్వంలోని భార‌త్ ల‌క్ష్యాన్ని 38.5 ఓవర్లలో ఛేదించింది. నాలుగో సారి క‌ప్పును ముద్దాడింది. శుభమన్ గిల్, శివమ్ మావి వంటి ఆట‌గాళ్లు ఉన్నారు.

No Ball Six Hit wicket : ఇలా ఎప్పుడూ చూసి ఉండ‌రు.. ఒకే బంతికి నోబాల్‌, సిక్స్‌, హిట్‌వికెట్‌..

2020 : ప్రియ‌మ్ గార్గ్ నాయ‌క‌త్వంలో బ‌రిలోకి దిగిన భార‌త్ ఫైన‌ల్ మ్యాచులో బంగ్లాదేశ్ చేతిలో మూడు వికెట్ల (డ‌క్‌వ‌ర్త్‌లూయిస్) తేడాతో ఓడిపోయింది. పోచెఫ్‌స్ట్రూమ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ 177 పరుగులకు ఆలౌటైంది. సవరించిన 170 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 42.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్, రవి బిష్ణోయ్ ఆట‌గాళ్లు ఈ జ‌ట్టులో ఉన్నారు.

2022 : ఇంగ్లాండ్ జ‌ట్టును ఓడించి భార‌త్ టోర్నీ చ‌రిత్ర‌లో ఐద‌వ సారి క‌ప్పును అందుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ 189 పరుగులకు ఆలౌటైంది. యశ్‌ ధుల్‌ నేతృత్వంలోని భార‌త్ 47.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. రాజ్‌వర్ధన్ హంగర్గేకర్, రాజ్ బావా వంటి ఆటగాళ్లు ఉన్నారు.

డిఫెండింగ్ ఛాంపియ‌న్‌గా బ‌రిలోకి దిగిన భార‌త్ వ‌రుస‌గా ఐదో సారి అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌కు చేరుకుంది. మూడో సారి ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డ‌నుంది. దీంతో ముచ్చ‌గా మూడోసారి ఆసీస్‌ను ఓడించి ఆరోసారి ప్ర‌పంచ‌క‌ప్‌ను టీమ్ఇండియా సొంతం చేసుకోవాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

Viral Video : బ్యాట‌ర్ ఏదో క‌నిక‌ట్టు చేసిన‌ట్లు ఉన్నాడుగా..!