భువనేశ్వర్ ఔట్: ఆ ముగ్గురిలో ఎవరికి చోటు?

  • Published By: vamsi ,Published On : December 14, 2019 / 04:47 AM IST
భువనేశ్వర్ ఔట్: ఆ ముగ్గురిలో ఎవరికి చోటు?

Updated On : December 14, 2019 / 4:47 AM IST

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ముందు భారత్ జట్టుకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ముగిసిన మూడు టీ20ల సిరీస్‌ని 2-1తో దక్కించుకున్న టీమిండియా.. ఆదివారం నుంచి విండీస్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడబోతోంది.  అయితే వెస్టిండీస్‌తో ఆఖరి టీ20లో గాయపడిన ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్.. ఈ వన్డే సిరీస్‌కి దూరం అయ్యారు. అతని స్థానంలో శార్ధుల్ ఠాకూర్‌ జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వన్డే ప్రపంచకప్ తర్వాత తొడ కండరాల గాయం కారణంగా దాదాపు నాలుగు నెలలు టీమిండియాకి దూరమైన భువనేశ్వర్ కుమార్ ఇటీవల మళ్లీ టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే మూడు మ్యాచ్‌ల వ్యవధిలోనే గాయం తిరగబడడంతో భువీకి విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావించింది. వాంఖడే వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో భువనేశ్వర్ బౌలింగ్ చేస్తూ అసౌకర్యంగా కనిపించాడు. ఈ క్రమంలోనే అతనికి రెస్ట్ ఇచ్చారు. 

భారత వన్డే జట్టులో ఇప్పటికే మహ్మద్ షమీ, దీపక్ చాహర్ రూపంలో ఫాస్ట్ బౌలర్లు ఉండగా.. ఆల్‌రౌండర్ శివమ్ దూబే కూడా కొన్ని ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే సీనియర్ ఉమేశ్ యాదవ్‌కి అవకాశం ఇస్తారా..? లేక యువ పేసర్లకి ఛాన్స్ ఇస్తారా..? అనేదానిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే శార్ధుల్ ఠాకూర్‌, నవదీప్ షైనీకి కూడా అవకాశం దక్కవచ్చునని అంటున్నారు. ఈ ముగ్గురిలో ఎవరికి అవకాశం అనేది తెలియవలసి ఉంది.

భారత్, వెస్టిండీస్ మధ్య ఆదివారం చెన్నై వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరగనుండగా.. రెండో వన్డే బుధవారం విశాఖపట్నంలో, మూడో వన్డే కటక్‌లో ఆదివారం (ఈ నెల22న) జరగనుంది.