రవిశాస్త్రి కండీషన్ తో షాక్ : IPLలో భారత బౌలర్లు ఆడొద్దు

ప్రపంచవ్యాప్తంగా అత్యంత రిచ్ లీగ్‌గా పేరొందిన దేశీవాలీ లీగ్ ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్). క్రికెట్ అభిమానులకు ఈ టోర్నీని ఓ పండుగలా భావిస్తారు. మరికొద్ది రోజుల్లో ఆరంభం కానున్న ఈ లీగ్‌కు ప్రతి జట్టు స్టార్ ప్లేయర్లతో సిద్దమైపోతుంది. ఇందులో కీలకంగా భారత జట్టు ప్లేయర్లు కూడా ఉండటం విశేషం. ఇప్పటికే ప్రపంచ కప్‌కు కొద్ది రోజుల ముందు వరకూ ఈ లీగ్ జరగనుండటంతో విదేశీ ప్లేయర్లు 2019 సీజన్‌లో పాల్గొనేందుకు నిరాకరించారు. ఇప్పుడు వారితో పాటు భారత బౌలర్లను కూడా ఐపీఎల్ నుంచి విశ్రాంతి తీసుకోవాలని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి సూచిస్తున్నాడు.
ఇప్పటికే వరుస విదేశీ పర్యటనలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో అలసిపోయిన టీమిండియా బౌలర్లకు విశ్రాంతి ఇవ్వాలని కోచ్ పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో ఒకవేళ గాయాలకు గురైతే ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు ఆటంకంగా మారుతుందని ఆయన ఈ సలహాలిస్తున్నాడు. ఈ విషయమై ఐపీఎల్ ఫ్రాంచైజీలను సంప్రదించిన రవిశాస్త్రి ఆటగాళ్లకే ఛాయిస్‌ను వదిలేయాల్సిందిగా కోరాడు.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలలో జస్ప్రిత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌లు విడతల వారీగా విశ్రాంతి తీసుకుంటూనే మ్యాచ్‌లలో పాల్గొంటున్నారు. విదేశీ పిచ్‌లపై ఫాస్ట్ బౌలర్ల ఆవశ్యకత ఉండటంతో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి వారిని జాగ్రత్తగా చూసుకోవాలని ఆరాటపడుతున్నాడు.