Ishan Kishans (Image Credit BCCI)Ishan Kishans (Image Credit BCCI)
IPL 2025: ఐపీఎల్ -2025 సీజన్ లో భాగంగా బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్ (MI) వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Also Read: IPL 2025: మారని హైదరాబాద్ తీరు.. మరో ఘోర పరాజయం
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో క్లాసెన్ (71), అభినవ్ మనోహర్ (43) పరుగులు చేశారు. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ జట్టు 15.4 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 146 పరుగులు చేసి విజేతగా నిలిచింది. రోహిత్ శర్మ తన జోరును కొనసాగించాడు. ఈ మ్యాచ్ లో (70) పరుగులు చేసి ముంబై విజయంలో కీలక భూమిక పోషించాడు. చివరిలో సూర్యకుమార్ యాదవ్ (40 నాటౌట్) దూకుడుగా ఆడాడు. సన్ రైజర్స్ జట్టు ఈ మ్యాచ్ లో ఓడిపోవటంతో ప్లేఆప్స్ ఆశలు దాదాపు కోల్పోయినట్లేనని చెప్పొచ్చు. అయితే, ఈ మ్యాచ్ లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ సమయంలో ఓపెనర్ హెడ్ (0) డకౌట్ కావటంతో క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ (1) పరుగు మాత్రమే చేసి పెవిలియన్ బాటపట్టాడు. అయితే, ఇషాన్ కిషన్ తన తొందరపాటు నిర్ణయం వల్ల ఔట్ కాకపోయినా ఔట్ అయినట్లు పెవిలియన్ కు చేరడం చర్చనీయాంశంగా మారింది. దీపక్ చాహర్ వేసిన ఓవర్లలో లెగ్ సైడ్ వెళ్తున్న బంతిని ఫైన్ లెగ్ దిశగా ఆడేందుకు ఇషాన్ ప్రయత్నించగా.. బ్యాట్ కు దొరక్కుండా వచ్చిన బంతిని వికెట్ కీపర్ రికిల్టన్ ఒడిసి పట్టుకున్నాడు. అయితే, అటు బౌలర్, ఇటు వికెట్ కీపర్ సహా ఎవరూ ఔట్ అని అప్పీల్ చేయలేదు. కానీ, తాను ఔటైనట్లు భావించిన ఇషాన్ కిషన్ క్రీజును విడిచిపెట్టాడు. అంపైర్ వైడ్ ఇవ్వాలా.. ఔట్ ఇవ్వాలా అన్నట్లు సంశయంతో కనిపించింది. చివరికి వేలు పైకెత్తాడు. తాను ఔట్ అనుకుని ఇషాన్ పెవిలియన్ వైపు అడుగులు వేశాడు. ఈ క్రమంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య ఇషాన్ ను అభినందిస్తూ భుజం తట్టాడు. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. రిప్లైలో మాత్రం బ్యాట్ ను బంతి తాకనే లేదని తేలింది.
🚨 ISHAN KISHAN DISMISSAL MOMENT 🚨 pic.twitter.com/y75dm8v0bM
— Johns. (@CricCrazyJohns) April 23, 2025
ఇషాన్ కిషన్ తీరుపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే వరుస ఓటములతో జట్టు ఇబ్బందుల్లో ఉంటే.. ఇప్పుడే నీ నిజాయితీ చూపించుకోవాల్సి వచ్చిందా..? అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇషాన్ కిషన్ కు మతిపోయినట్టుంది అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేయగా.. కొందరు నెటిజన్లు ఓ అడుగు ముందుకేసి మ్యాచ్ ఫిక్సయిందనడానికి ఇదే నిదర్శనమని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.