RR vs DC : మ్యాచ్ మధ్యలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌ల మధ్య వాగ్వాదం.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..
శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో (RR vs DC)ఆర్ఆర్ ఆటగాడు రవీంద్ర జడేజా, ఢిల్లీ ప్లేయర్ అక్షర్ పటేల్‌లు సరదాగా గొడవ పడ్డారు.
- Thota Vamshi Kumar
- Published on- May 2, 2026 / 08:27 AM IST
IPL 2026 RR vs DC Ravindra Jadeja and Kuldeep Yadav poking fun at each other during the match
- శుక్రవారం జైపూర్ వేదికగా జరిగిన రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్
- జడేజా బ్యాటింగ్ చేసేందుకు వస్తుండగా ఎదురుగా వెళ్లిన కుల్దీప్
- వీడియో వైరల్
RR vs DC : ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఆర్ఆర్ తరుపున రవీంద్ర జడేజా, ఢిల్లీ తరుపున కుల్దీప్ యాదవ్‌లు ఆడుతున్న సంగతి తెలిసిందే. కాగా.. మ్యాచ్ మధ్యలో రాజస్థాన్ ఇన్నింగ్స్ సమయంలో జడేజా, కుల్దీప్ ఇద్దరు ఒకరినొకరు సరదాగా ఆటపట్టించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే..?
రాజస్థాన్ ఇన్నింగ్స్ సమయంలో ఈ ఘటన జరిగింది. ధ్రువ్ జురెల్ 12వ ఓవర్‌లో ఔట్ అయ్యాడు. ఈ సమయంలో రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి వస్తున్నాడు. కుల్దీప్ యాదవ్ అతడికి ఎదురుగా రావడాన్ని గమనించిన జడేజా.. అతడిని భయపెట్టాలని తన బ్యాట్‌తో కొడుతున్నట్లుగా చేశాడు. అయితే.. కుల్దీప్ ఏ మాత్రం భయపడకుండా జడేజా భుజాలపై చేతులు వేసి ఏం ఆడతావు లే వెళ్లిపో అన్నట్లుగా అతడిని నెట్టి వేశాడు.
మైదానంలోకి వచ్చిన జడేజా బ్యాట్‌ను గేజ్ సాయంతో అంపైర్ చెక్ చేస్తుండగా కూడా కుల్దీప్ మరోసారి జడ్డూ నెట్టేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరి మధ్య ఉన్న బంధంపై నెటిజన్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఆర్ఆర్ బ్యాటర్లలో రియాన్ పరాగ్ (90; 50 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్థశతకం చేశాడు. ధ్రువ్ జురెల్ (42; 30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా ఆఖరిలో డోనోవన్ ఫెరీరా (47 నాటౌట్; 14 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు, కైల్ జేమీసన్, అక్షర్ పటేల్, నటరాజన్ తలా ఓ వికెట్ సాధించారు.
OMG 😱 War between Kuldeep Yadav & Ravindra Jadeja 😭#DCvsRR #RRvsDC
Kyle Jamieson #Peddi
Riyan Paragpic.twitter.com/ZZNhckDYMN— Rolex x👑 (@Tfg85743663) May 1, 2026
ఆ తరువాత 226 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (75; 40 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు), పాతుమ్ నిస్సాంక (62; 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థశతకాలు సాధించారు. ఆర్ఆర్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్ పాండే, రవీంద్ర జడేజాలు తలా ఓ వికెట్ సాధించారు.
