Axar Patel : గత మ్యాచ్ తరువాత ఇద్దరు చనిపోయారు.. ఈ విజయం వారికే అంకితం.. అక్షర్ పటేల్ కీలక వ్యాఖ్యలు..
రాజస్థాన్ రాయల్స్ పై విజయం సాధించడం పట్ల ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ (Axar Patel) ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
IPL 2026 RR vs DC Axar Patel key comments after Delhi Capitals defeat Rajasthan Royals (pic credit@ipl)
- హ్యాట్రిక్ ఓటముల తరువాత విజయం
- ఆనందాన్ని వ్యక్తం చేసిన ఢిల్లీ కెప్టెన్
Axar Patel : ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాట్రిక్ ఓటముల తరువాత ఓ విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం పట్ల ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. పేసర్ మిచెల్ స్టార్క్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.
ఈ మ్యాచ్‌లో రియాన్ పరాగ్ (90; 50 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా డోనోవన్ ఫెరీరా (47 నాటౌట్; 14 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా ధ్రువ్ జురెల్ (42; 30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీశాడు. కైల్ జేమీసన్, అక్షర్ పటేల్, నటరాజన్ తలా ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం కేఎల్ రాహుల్ (75; 40 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు), పాతుమ్ నిస్సాంక (62; 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. నితీశ్ రాణా (17 బంతుల్లో 33 పరుగులు) రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఆర్ఆర్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్ పాండే, రవీంద్ర జడేజాలు తలా ఓ వికెట్ పడగొట్టారు.
ప్రణాళిక ప్రకారం ఆడాం..
ఈ మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అదే సమయంలో గత మ్యాచ్‌ల్లో ఓటమి తరువాత కూడా తాము సానుకూల దృక్పథంతోనే ఉన్నామన్నాడు. ప్రతి రోజు మైదానంలోకి వచ్చి బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తే ఫలితాలు వాటి అంతటా అవే వస్తాయన్నాడు. ఇక ఈ మ్యాచ్‌ల్లో తమ ప్లేయర్లు ఆడిన విధానం పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.
ముఖ్యంగా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా ఆడారన్నారు. తమ ప్రణాళికలను చక్కగా అమలు చేశామన్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో ప్రత్యర్థి జట్టులోని కీలక వికెట్లు తీయడం వల్ల మ్యాచ్ మలుపు తిరిగిందన్నాడు. ఆ క్షణంలో తనకంటే ఎక్కువగా ఎవరూ సంతోషించి ఉండరన్నాడు.
చాలా కాలం తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. మూడు నెలల విరామం తరువాత తిరిగి వచ్చి అద్భుత ప్రదర్శన చేశాడన్నాడు. అతడు ఎంతటి గొప్ప ఆటగాడో దీన్ని బట్టి తెలుస్తుందన్నాడు. స్టార్క్ ఫామ్‌లోకి రావడం నిజంగా తమకు పెద్ద సానుకూలాంశం అని తెలిపాడు.
Axar Patel dedicated this win to the 2 DC toli fans who passed away recently due to an accident.
– Great gesture by Axar. 🙏❤️ pic.twitter.com/6vOUGdRRdF
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 1, 2026
ఇక తన కెప్టెన్సీ అనుభవం గురించి మాట్లాడుతూ.. తాను భారత జట్టులో ఉన్నప్పుడు కూడా నాయకత్వ పాత్రలో పని చేశానని, అది తనకు ఎంతో సహయపడుతుందన్నాడు. ఐపీఎల్లో స్వదేశీ ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నాడు. సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యమన్నాడు. ఈ విషయంలో తాను ఎంతో మెరుగుపడ్డానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తాను ఎక్కువగా ఆలోచించడం లేదన్నాడు. గత మ్యాచ్ తరువాత ఢిల్లీ క్యాపిటల్స్ కుటుంబానికి చెందిన ఇద్దరు ఫ్యాన్స్ ఓ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయారని, ఈ విజయాన్ని వారికే అంకితం ఇస్తున్నట్లు అక్షర్ పటేల్ చెప్పాడు.
