ఐపీఎల్ బాదుడుతో వరల్డ్ కప్ ప్లేస్ కొట్టేయొచ్చు

టీమిండియా క్రికెటర్ అజింకా రహానె వరల్డ్ కప్ అవకాశాలపై స్పందించాడు. ఐపీఎల్‌లో బాగా రాణిస్తే వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోవచ్చనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. టీమిండియా టీ20, వన్డే జట్లలో నెంబర్4 పొజిషన్‌లో బ్యాటింగ్‌కు దిగుతోన్న రహానె.. ప్రపంచ కప్ టోర్నీలోనూ స్థానం దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
ఇటీవల భారత్-ఆస్ట్రేలియాల మధ్య ముగిసిన వన్డే సిరీస్‌లో స్థానం దక్కించుకోలేని రహానెకు ఐపీఎల్ ఒక్కటే అవకాశంగా కనిపిస్తోంది. ఐపీఎల్ ఆరంభానికి మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉండటంతో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజింకా రహానె జట్టు కోసం ఇప్పటికే ప్రాక్టీసులో మునిగిపోయాడు.
‘ఏయే టోర్నీలలో, ఫార్మాట్లలో ఆడుతున్నామని కాదు. ఒత్తిడిలోనూ మన ప్రదర్శన ఎలా ఉందనేది ముఖ్యం. వరల్డ్ కప్‌కు ముందు టీమిండియా మరే టోర్నీలో ఆడే అవకాశాల్లేవు. అందుకే ఐపీఎల్ లో బాగా రాణించాలనుకుంటున్నా. పెర్‌ఫార్మెన్స్ బాగుంటే ప్రపంచ కప్ టోర్నీలో ఆడేందుకు టీమిండియాలో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి’ అని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.
టీమిండియా కెప్టెన్ ఆస్ట్రేలియాతో వన్డే టోర్నీ ముగియగానే వరల్డ్ కప్ జట్టు గురించి ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు చెప్పాడు. అంటే దాదాపు 15మంది క్రికెటర్లతో కూడిన జాబితా సిద్ధమైపోయినట్లే. మరి రహానె ఆశలు ఎంతవరకూ నిజమవుతాయో వేచి చూడాలి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ప్రదర్శన ఆధారంగా వరల్డ్ కప్ జట్టు ఉండదని కోహ్లీ కొద్ది రోజుల ముందే స్పష్టం చేశాడు.