Telangana High court: కాళేశ్వరంపై సీబీఐ విచారణకు బ్రేక్.. హైకోర్టు కీలక ఆదేశాలు
Telangana High court: కాళేశ్వరంపై సీబీఐ విచారణకు బ్రేక్ పడింది. అక్టోబర్ 7వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Telangana High Court
Telangana High court: తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులకు స్వల్ప ఊరట లభించింది. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు హైకోర్టు బ్రేక్ వేసింది. అక్టోబర్ 7వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణ దాకా తొందరపాటు చర్యలు వద్దని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు (Telangana High court) స్పష్టం చేసింది.
Also Read: KTR Counter to Kavitha : కేటీఆర్ సంచలన ట్వీట్..! హరీశ్ రావుపై కవిత చేసిన ఆరోపణలకు కౌంటర్..!
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ నివేదికను ప్రభుత్వం ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నివేదికపై సుదీర్ఘ చర్చ అనంతరం తెలంగాణ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. అయితే, కమిషన్ నివేదిక ఆధారంగా తమపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కేసీఆర్, హరీశ్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు నివేదిక ఆధారంగానే కేసు విచారణను సీబీఐకి ఇవ్వడం లేదని, అన్ని నివేదికలు చూసిన తరువాతనే కేసును సీబీఐకి ఇవ్వడం జరిగిందని ఏజీ సుందర్శన్ రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ ఇరిగేషన్ శాఖ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై చర్చించడం జరిగింది.. తెలంగాణ శాసనసభలో చర్చ అనంతరం సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేవలం నిర్ణయం మాత్రమే తీసుకుంది.. ఇంకా ఎలాంటి యాక్షన్ జరగలేదని ఏజీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
కోర్టు స్పందిస్తూ తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.