IPL2022 SRH Vs RCB : హడలెత్తించిన హసరంగ.. హైదరాబాద్‌పై బెంగళూరు ఘన విజయం

సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అదరగొట్టింది. హైదరాబాద్ పై ఘన విజయం సాధించింది.

IPL2022 SRH Vs RCB : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అదరగొట్టింది. హైదరాబాద్ పై 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 125 పరుగులకే (19.2 ఓవర్లు) ఆలౌట్ అయ్యింది. బెంగళూరు బౌలర్‌ వనిందు హసరంగ (5/18) విజృంభించాడు. దీంతో హైదరాబాద్‌ 125 పరుగులకే పరిమితమైంది. హైదరాబాద్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి ఒంటరి పోరాటం చేశాడు. హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

రాహుల్ త్రిపాఠి 37 బంతుల్లో 58 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 6 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. మార్‌క్రమ్‌ (21), పూరన్ (19) మినహా ఎవరూ రెండంకెల స్కోరును నమోదు చేయలేదు.

Virat Kohli: ఐపీఎల్ 2022లో మూడోసారి గోల్డెన్ డక్‌గా విరాట్

బెంగళూరు బౌలర్లలో వనిందు హసరంగ చెలరేగాడు. ఏకంగా 5 వికెట్లు తీసి హైదరాబాద్ ఓటమిని శాసించాడు. హేజిల్ వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. గ్లెన్ మ్యాక్స్ వెల్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోర్ చేసింది.

ఈ విజయంతో బెంగళూరు రన్‌రేట్‌ను మెరుగుపరుచుకుంది. దాంతోపాటు ప్లేఆఫ్స్ ఛాన్స్‌లను మరింత మెరుగుపర్చుకుంది. కాగా, ఓటమి బాటలో కొనసాగుతున్న హైదరాబాద్‌ అవకాశాలను తగ్గించుకుంటోంది. హైదరాబాద్‌కిది వరుసగా నాలుగో ఓటమి.

IPL2022 SRH Vs RCB Royal Challengers Bangalore Won On Sunrisers Hyderabad By 67 Runs

తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. బెంగళూరు కెప్టెన్‌ డు ప్లెసిస్‌ (73*) దంచికొట్టాడు. 50 బంతుల్లో 73 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 8 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. డుప్లెసిస్‌ తో పాటు రజత్‌ పటిదార్‌ (48), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ (33), దినేశ్‌ కార్తిక్‌ (30*) ధాటిగా ఆడారు. ఫలితంగా బెంగళూరు భారీ స్కోర్ చేసింది. కాగా, విరాట్‌ కోహ్లీ మరోసారి తీవ్రంగా నిరాశపరించాడు. గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. హైదరాబాద్‌ బౌలర్లలో జగదీశ్‌ సుచిత్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. కార్తిక్‌ త్యాగి ఒక వికెట్‌ తీశాడు.

Chris Gayle: “నాకు గౌరవం దక్కలేదు.. అలా జరగాల్సిందే”

చివరల్లో దినేశ్ కార్తిక్ మెరుపులు మెరిపించాడు. ఫరూఖి వేసిన చివరి ఓవర్‌లో ఏకంగా 25 పరుగులు రాబట్టాడు. ఇందులో మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌ ఉన్నాయి. బౌండరీ లైన్‌ వద్ద త్రిపాఠి క్యాచ్‌ మిస్‌ చేయడంతో వరుస బంతుల్లో కార్తిక్‌ మూడు సిక్సర్లతో పాటు ఫోర్ బాదడం విశేషం. ఆఖరి ఐదు ఓవర్లలో బెంగళూరు బ్యాటర్లు 67 పరుగులను జోడించారు.

కాగా, టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. జగదీష్‌ సుచిత్ వేసిన తొలి ఓవర్‌లో మొదటి బంతికే విరాట్ కోహ్లీ (0) గోల్డెన్ డకౌట్‌ అయ్యాడు. టీ20 లీగ్‌లో కోహ్లీ ఇప్పటివరకు ఆరుసార్లు గోల్డెన్ డకౌట్‌ కాగా.. ఇందులో మూడు ఈ సీజన్‌లోనే(2022) కావడం గమనార్హం. రెండుసార్లు హైదరాబాద్‌తోనే గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు.

ఇప్పటివరకు 12 మ్యాచులు ఆడిన బెంగళూరు 7 విజయాలు నమోదు చేసింది. ప్రస్తుతం 14 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు హైదరాబాద్‌ జట్టు ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడింది. 5 మ్యాచుల్లో గెలుపొందింది. ప్రస్తుతం 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.

సన్ రైజర్స్ హైదరాబాద్‌ జట్టు: అభిషేక్‌ శర్మ, కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), రాహుల్‌ త్రిపాఠి, మార్‌క్రమ్‌, నికోలస్‌ పూరన్‌, శశాంక్‌ సింగ్‌, సుచిత్‌, కార్తిక్‌ త్యాగి, భువనేశ్వర్‌ కుమార్‌, ఫారూకీ, ఉమ్రాన్‌ మాలిక్‌.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: విరాట్‌ కోహ్లీ, ఫా డుప్లెసిస్‌ (కెప్టెన్‌), రజత్‌ పటిదార్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మహిపాల్‌ లోమ్రర్‌, షాబాజ్‌ అహ్మద్‌, దినేశ్‌ కార్తీక్‌, వానిందు హసరంగ, హర్షల్‌ పటేల్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌, మహ్మద్‌ సిరాజ్‌.

ట్రెండింగ్ వార్తలు