Aus Vs Ind: అందుకే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చెత్తగా ఆడుతున్నాడు.. మాజీ క్రికెటర్లు ఏమన్నారంటే?
గిల్ ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తున్నాడని తెలిపారు.
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ 1-2 తేడాతో ఓడిపోవడంతో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై విమర్శలు వచ్చాయి. ఈ సిరీస్‌లో గిల్ మూడు మ్యాచుల్లో కేవలం 43 పరుగులు మాత్రమే చేశాడు. వన్డేల్లో గిల్ పర్ఫార్మన్స్‌పై ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
కెప్టెన్సీ బాధ్యతలు, వరుసగా సిరీస్‌లు ఆడుతుండడంతో గిల్ ఒత్తిడికి గురవుతున్నాడని మాజీ క్రికెటర్లు అంటున్నారు. సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు గిల్ ఆసియా కప్, వెస్టిండీస్‌తో టెస్ట్‌లు, తాజాగా ఆస్ట్రేలియాతో వన్డేలు ఆడాడు. ఈ నెల 29 నుంచి ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఉంది. ఆగస్టులో ఒక్క నెల మాత్రమే అతడికి విశ్రాంతి దక్కింది.
గిల్ పర్ఫార్మన్స్‌పై మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “గిల్ ఈ మధ్య చాలా మ్యాచ్‌లు ఆడాడు. ఓపెనింగ్‌లో ఆడాల్సి వస్తోంది, అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉండాల్సి వస్తోంది.
అలాగే, ఐపీఎల్ కెప్టెన్సీ బాధ్యత కూడా ఉంది. ఆక్షన్ కూడా రాబోతుంది. ప్లానింగ్ కోసం గుజరాత్ టైటాన్స్‌తో అతడు చర్చల్లోనూ పాల్గొనాల్సి ఉంటుంది. అతనికి చాలా బాధ్యతలు ఉన్నాయి. ఇది అతని బ్యాటింగ్ పై ప్రభావం చూపించింది. అతను మానసికంగా అలసిపోయినట్లు కనిపిస్తున్నాడు” అని అన్నారు.
గిల్ పర్ఫార్మన్స్‌పై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా స్పందించారు. మరికొన్ని అంశాలు కూడా గిల్ ప్రదర్శనపై ప్రభావం చూపిస్తున్నాయని చెప్పారు. “ఇంగ్లండ్‌లో బాగా పర్ఫార్మన్స్ చేసిన చేసిన తర్వాతి నుంచి గిల్ ఒత్తిడి పెంచుకుంటున్నాడు. ఈ తీరు సరికాదు.. ఎప్పటిలాగే గిల్ తనదైన శైలిలో ఆడాలి. ఆసీస్‌తో చివరి వన్డేలో గిల్ బాగానే ఆడాడు కానీ.. బౌలర్ హజ్ల్‌వుడ్ నుంచి మంచి డెలివరీ వచ్చింది. అది వికెట్ టేకింగ్ డెలివరీ” అని చెప్పారు.
రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా రావడం, అదే రోహిత్‌తో కలిసి ఓపెనింగ్ చేయడం వంటివి ప్రస్తుతం గిల్ ఫామ్‌కి కారణం అవుతున్నట్లు అభిప్రాయపడ్డారు. గిల్ ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తున్నాడని తెలిపారు.
