Lionel Messi vs Cristiano Ronaldo : ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఇదే చివరిసారి? అభిమానుల కల నిజమవుతుందా? మెస్సీ వర్సెస్ రొనాల్డో మ్యాచ్ జరిగేనా?
ఫిఫా ప్రపంచకప్ 2026లో రొనాల్డో, మెస్సీ (Lionel Messi vs Cristiano Ronaldo) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న దానిపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.
- Thota Vamshi Kumar
- Updated on- June 10, 2026 / 02:05 PM IST
Is their Lionel Messi vs Cristiano Ronaldo match Possible In FIFA World Cup 2026
Lionel Messi vs Cristiano Ronaldo : ఫుట్‌బాల్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫిఫా ప్రపంచకప్ రేపటి (జూన్ 11) నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో అందరి చూపు ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లపైనే ఉంది. వారు మరెవరో కాదు అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ, పోర్చుగల్ దిగ్గజ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో. ఇక వీరిద్దరికి కూడా ఇదే చివరి ప్రపంచకప్ అని ప్రచారం సాగుతోంది. వయసు దృష్ట్యా కూడా వీరిద్దరికి ఇదే ప్రపంచకప్ కావొచ్చునని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఈ మెగాటోర్నీలో మెస్సీ వర్సెస్ రొనాల్డో పోరు చూడాలని సగటు ఫుట్ బాల్ అభిమాని కోరుకుంటున్నారు. వీరిద్దరు ముఖాముఖిగా తలపడితే అంతకన్నా మించి ఇంకేం వద్దని అంటున్నారు. కాగా.. వీరిద్దరు ఫుట్‌బాల్ మైదానంలో ఓ మ్యాచ్‌లో ముఖాముఖిగా తలపడి ఆరేళ్లు కావడం గమనార్హం. 2020లో జరిగిన UEFA ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్‌లో ఒకరినొకరు ఎదుర్కొన్నారు. ఆ మ్యాచ్‌లో యువెంటిస్ కు రొనాల్డో, బార్సిలోనాకు మెస్సీ ఆడారు. ఆ మ్యాచ్‌లో 3-0 తేడాతో బార్సిలోనా పై యువెంటిస్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రొనాల్డో రెండు గోల్స్ వేశాడు. ఆ తర్వాత ఇద్దరూ వేర్వేరు లీగ్‌లలో ఆడటం వల్ల మరోసారి తలపడలేదు.
*పాండ్యాకు మళ్లీ ఏమైంది?.. ఈసారి అఫ్ఘాన్ వన్డే సిరీస్ కే దూరం.. అక్కడ ఏం తప్పు జరిగింది?
అయితే.. 2026 ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా, పోర్చుగల్ జట్లు క్వార్టర్ ఫైనల్స్‌లోనే తలపడే అవకాశాలు ఉన్నాయి. ఈ మెగాటోర్నీలో అర్జెంటీనా గ్రూప్ ‘జె’ లో ఉండగా.. పోర్చుగల్ గ్రూప్ ‘కె’ లో ఉంది. మెస్సి నేతృత్వంలోని అర్జెంటీనా జట్టు అల్జీరియా, ఆస్ట్రియా, జోర్డాన్ వంటి దేశాలతో తలపడాల్సి ఉండగా.. రొనాల్డోకు చెందిన పోర్చుగల్ జట్టు డీఆర్ కాంగో, ఉజ్బెకిస్తాన్, కొలంబియాలతో పోటీ పడనుంది. ఈ టోర్నమెంట్‌లో అర్జెంటీనా వర్సెస్ పోర్చుగల్ లేదా మెస్సి వర్సెస్ రొనాల్డో మ్యాచ్ జరగడానికి మొత్తం మూడు అవకాశాలు ఉన్నాయి.
ఈ మూడు సందర్భాల్లో ఏదో ఒకటి జరిగితేనే రొనాల్డో వర్సెస్ మెస్సీ
* ఒకవేళ అర్జెంటీనా, పోర్చుగల్ రెండు జట్లు తమ తమ గ్రూపులలో అగ్రస్థానంలో నిలిచి ఆ తరువాత జరిగే రెండు నాకౌట్ మ్యాచ్‌లు (రౌండ్ ఆఫ్ 32, రౌండ్ ఆఫ్ 16) గెలిస్తే అప్పుడు అర్జెంటీనా, పోర్చుగల్‌లు క్వార్టర్ ఫైనల్‌లో తలపడే అవకాశం ఉంది.
* ఒకవేళ రెండు జట్లు తమ తమ గ్రూపుల్లో రెండో స్థానంలో నిలిచి తరువాతి రౌండ్‌కు అర్హత సాధిస్తే.. అప్పుడు క్వార్టర్ ఫైనల్‌లో కాకుండా రౌండ్ ఆఫ్ 16లోనే తలపడతాయి.
* ఒకవేళ ఒక జట్టు గ్రూప్ విజేతగా నిలిచి, మరొక జట్టు రెండవ స్థానంలో నిలిస్తే అప్పుడు రెండు జట్ల మార్గాలు వేరు వేరుగా సాగుతాయి. ఈ రెండు జట్లు ఫైనల్‌కు చేరుకుంటే తప్ప రొనాల్డొ వర్సెస్ మెస్సీ మ్యాచ్ చూసే అవకాశం లేదు. దీంతో అర్జెంటీనా, పోర్చుగల్ జట్లు ఫైనల్‌కు చేరుకోవాలని, ఫైనల్ మ్యాచ్‌లో రొనాల్డ్ వర్సెస్ మెస్సీ ని చూస్తే వచ్చే కిక్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుందని అంటున్నారు. అదే జరిగితే.. ఫుట్‌బాల్ చరిత్రలోనే ఓ మధురఘట్టంగా ఆ మ్యాచ్ నిలిచిపోతుందని చెబుతున్నారు.
