పాండ్యాకు మళ్లీ ఏమైంది?.. ఈసారి అఫ్ఘాన్ వన్డే సిరీస్ కే దూరం.. అక్కడ ఏం తప్పు జరిగింది?
భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం మరోసారి వాయిదా పడింది.
Hardik Pandya ruled out of the ODI series against Afghanistan
- హార్దిక్ పాండ్యాకు మరో గాయం
- అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు దూరం
Hardik Pandya : భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం మరోసారి వాయిదా పడింది. అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు అతడు అందుబాటులో ఉండడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఫిట్నెస్ పరీక్షల్లో ఉత్తీర్ణుడై జట్టులో చేరేందుకు సిద్ధమవుతున్న తరుణంలో హార్దిక్‌కు స్వల్ప గాయం కావడంతో అతడి రీఎంట్రీకి బ్రేక్ పడింది. ఈ క్రమంలో అతడు అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌కు దూరం అయినట్లు సమాచారం.
జూన్ 2 నుంచి బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శిక్షణ పొందుతున్న హార్దిక్ పాండ్యా మంచి లయలో కనిపించాడు. ఫిట్నెస్ టెస్టును క్లియర్ చేయడంతో జూన్ 11న ధర్మశాలలో జట్టుతో కలవాలని భావించాడు. కానీ.. చివరి నిమిషంలో అతడి కాలు బెణికినట్లు తెలుస్తోంది. స్వల్పగాయమే అయినప్పటికి కూడా వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
చివరి నిమిషంలో హార్దిక్ కాలు బెణికింది. ఇది ఏమంత తీవ్ర సమస్య కాదు. అయినప్పటికి కూడా రాబోయే కొద్ది రోజుల పాటు అతడు ఎలాంటి శ్రమ లేదా బరువులు మోయడం వంటి పనులు చేయవద్దని వైద్య సిబ్బంది సూచించారు. అతడు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోనే కోలుకుంటాడు. వైద్య బృందం అతడిని నిరంతరం పర్యవేక్షిస్తుంది అని ఓ బీసీసీఐ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ తెలిపాడు. కనీసం రెండు వారాల పాటు హార్దిక్‌కు విశ్రాంతి అవసరం అని సమాచారం.
హార్దిక్ గైర్హాజరీతో జట్టులోని యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి అవకాశాలు పెరిగాయి. మూడు వన్డేల్లోనూ అతడు ఆడే అవకాశముంది. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరం అయిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేశారు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్నెస్ టెస్టును క్లియర్ చేయడంతో అతడికి మార్గం సుగమం అయింది.
