Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన చేస్తోంది. లేక లేక ఓ విజయాన్ని సాధించడం ఆ తరువాత మళ్లీ ఓటమి బాటపట్టడం ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ తీరు ఇది. గత మ్యాచ్‌లో చెన్నైని దాని సొంతగడ్డపై ఓడించి మాల్దీవులకు విహారానికి వెళ్లొచ్చిన సన్‌రైజర్స్ శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 38 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఇది ఏడో ఓటమి కావడం గమనార్హం.
ఇప్పటి వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 మ్యాచ్‌లు ఆడింది. కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే విజయాలను సాధించింది. ఆ జట్టు ఖాతాలో 6 పాయింట్లు ఉండగా నెట్‌రన్‌రేట్ -1.192గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ పై ఓటమితో సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి.
ప్లేఆఫ్స్‌కు చేరాలంటే..?
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ మరో నాలుగు మ్యాచ్‌లు.. మే 5న ఢిల్లీ క్యాపిటల్స్, మే10న కోల్‌కతా నైట్‌రైడర్స్, మే 13న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మే18న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ నాలుగు మ్యాచ్‌ల్లోనూ సన్‌రైజర్స్ గెలుపొందాలి. ప్రస్తుతం నెట్‌రన్‌రేట్ మైనస్‌లో ఉండడంతో ఈ మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ భారీ తేడాతో విజయం సాధించాలి. అప్పుడు సన్‌రైజర్స్ ఖాతాలో 14 పాయింట్లు ఉంటాయి.
14 పాయింట్లు సాధిస్తే ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుందని చెప్పలేము. ఎందుకంటే ఇప్పటికే ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 14 పాయింట్లతో టాప్-3లో కొనసాగుతున్నాయి. ఈ జట్లు లీగ్ దశలో మరొక్క మ్యాచ్ గెలిచినా కూడా అవి సన్‌రైజర్స్ కంటే ముందు ఉంటాయి.
అటు పంజాబ్ కింగ్స్ 13, ఢిల్లీ క్యాపిటల్స్ 12 పాయింట్లతో నాలుగు ఐదు స్థానాల్లో ఉన్నాయి. కాబట్టి.. ఈ జట్లు అన్ని కూడా తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. అదే సమయంలో సన్‌రైజర్స్ అన్ని మ్యాచ్‌ల్లో గెలవాలి. అప్పుడే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్లేఆఫ్స్ చేరుకునే అవకాశాలు ఉంటాయి.
ప్రస్తుతం సన్‌రైజర్స్ ఆట తీరు చూస్తే.. అన్ని మ్యాచ్‌ల్లో గెలిచే అవకాశాలు కొంచెం కష్టమే. అదే సమయంలో మిగిలిన జట్లు అన్ని మ్యాచ్‌లు ఓడిపోవడం కూడా సాధ్యమయ్య పని కాదు. అందుకనే సన్‌రైజర్స్ ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఏదైనా మహాద్భుతం జరగాల్సిందే.