GT vs SRH : గుజ‌రాత్ చేతిలో ఓట‌మి.. స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ కామెంట్స్ వైర‌ల్‌.. మేం ఎందుకు ఓడిపోయామంటే..

గుజ‌రాత్ చేతిలో ఓట‌మి పై స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ స్పందించాడు.

GT vs SRH : గుజ‌రాత్ చేతిలో ఓట‌మి.. స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ కామెంట్స్ వైర‌ల్‌.. మేం ఎందుకు ఓడిపోయామంటే..

Courtesy BCCI

Updated On : May 3, 2025 / 8:55 AM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ క‌థ దాదాపుగా ముగిసిన‌ట్లే. మిగిలిన జ‌ట్లు ప్లేఆఫ్స్ రేసులో పోటీప‌డుతుంటే.. స‌న్‌రైజ‌ర్స్ మాత్రం చెన్నై, రాజ‌స్థాన్‌ల బాట‌లో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేస్తోంది. శుక్ర‌వారం న‌రేంద్ర‌మోదీ స్టేడియంలో గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 38 ప‌రుగుల తేడాతో ఓట‌మి చ‌విచూసింది.

ఈ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 224 ప‌రుగులు చేసింది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో శుభ్‌మ‌న్ గిల్ (76; 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), జోస్ బ‌ట్ల‌ర్ (64; 37 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) మెరుపు హాఫ్ సెంచ‌రీలు చేశారు. సాయి సుద‌ర్శ‌న్ (48; 23 బంతుల్లో 9 ఫోర్లు) వేగంగా ఆడాడు. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో జ‌య‌దేవ్ ఉన‌ద్క‌త్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. జీషన్ అన్సారీ, పాట్ క‌మిన్స్ చెరో వికెట్ తీశారు.

IPL 2025: అంపైర్‌తో వాగ్వివాదం సమయంలో అడ్డొచ్చాడని.. అభిషేక్ శర్మ వద్దకెళ్లి గిల్ ఏం చేశాడో చూశారా.. వీడియో వైరల్

అనంత‌రం భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 186 ప‌రుగులకే ప‌రిమిత‌మైంది. ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌లో అభిషేక్ శ‌ర్మ‌(74; 41 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీతో రాణించినా మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో స‌న్‌రైజ‌ర్స్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో సిరాజ్‌, ప్ర‌సిద్ద్ కృష్ణ చెరో రెండు వికెట్లు తీశారు. ఇషాంత్ శ‌ర్మ‌, జెరాల్డ్ కోట్జీ లు త‌లా ఓ వికెట్ సాధించారు.

గుజరాత్‌తో మ్యాచ్‌లో ఓడిపోవ‌డం త‌న‌ను బాధించింద‌ని స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ అన్నాడు. ప‌వ‌ర్ ప్లేలో ధారాళంగా ప‌రుగులు ఇచ్చుకోవ‌డంతో పాటు క్యాచ్‌లు మిస్ చేయ‌డం త‌మ ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్పుకొచ్చాడు.

మ్యాచ్ అనంత‌రం పాట్ క‌మిన్స్ మాట్లాడుతూ.. ప‌వ‌ర్ ప్లేలో తాము గొప్ప‌గా బౌలింగ్ చేయ‌లేక‌పోయామ‌న్నాడు. ఈ విష‌యంలో తన‌కు గిల్టీగా ఉంద‌ని, ప‌వ‌ర్ ప్లేలోనే వారు 20 నుంచి 30 ప‌రుగులు అద‌నంగా సాధించార‌న్నాడు.

IPL 2025: పాపం గిల్.. సెంచరీ చేయకుండా కావాలనే అడ్డుకున్నారా..? అతను ఔట్ కాదా.. అసలేం జరిగిందంటే.. వీడియో వైరల్

త‌మ ఫీల్డ‌ర్లు ఒక‌టి రెండు క్యాచ్‌ల‌ను మిస్ చేయ‌డం ఏమీ బాలేద‌న్నాడు. ఇందులో తాను కూడా దోషినేన‌ని అన్నాడు. ‘200 ప‌రుగుల ల‌క్ష్యం అయితే.. ఛేదించేందుకు సులువుగా ఉండేది. గుజ‌రాత్ బ్యాట‌ర్లు క్లాస్ ఆట‌గాళ్లు. వాళ్లు అడ్డ‌దిడ్డంగా ఏమీ ఆడ‌రు. చెత్త బంతుల‌ను మాత్రం బౌండ‌రీల‌కు త‌ర‌లిస్తుంటారు. ఈ పిచ్ బాగుంది. మేము బౌలింగ్‌లో చివ‌రి 14 ఓవ‌ర్ల‌లో 140 ప‌రుగులు ఇవ్వ‌డం గొప్ప విష‌యం. ‘అని క‌మిన్స్ అన్నాడు.

ఇక స‌న్‌రైజ‌ర్స్ బ్యాటింగ్ విభాగం గురించి మాట్లాడుతూ.. అభిషేక్ శ‌ర్మ చాలా చ‌క్క‌గా ఆడాడ‌ని ప్ర‌శంసించాడు. ఆఖ‌రిలో నితీశ్ బాగా ఆడాడ‌ని తెలిపాడు. గ‌తేడాది మెగావేలం జ‌రిగింది. మూడేళ్లుగా ఆడిన కోర్ టీమ్‌నే కొన‌సాగించారు. అయిన‌ప్ప‌టికి ఈ సీజ‌న్‌లో ఏదీ క‌లిసి రాలేదు అని క‌మిన్స్ చెప్పుకొచ్చాడు.

Rajasthan Royals : అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి రాజ‌స్థాన్ ఔట్‌.. కోల్‌క‌తా, పంజాబ్ ల‌కు కొత్త క‌ష్టం..!