Rajasthan Royals : అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి రాజస్థాన్ ఔట్.. కోల్‌కతా, పంజాబ్ లకు కొత్త కష్టం..!
ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా రాజస్థాన్ రాయల్స్ నిష్ర్కమించింది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా రాజస్థాన్ రాయల్స్ నిష్ర్కమించింది. గురువారం జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్ఆర్ 100 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఈ సీజన్‌లో రాజస్థాన్‌కు ఇది ఎనిమిదో ఓటమి కావడం గమనార్హం.
ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో మూడు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. 6 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ -0.780గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఆర్ఆర్ మరో మూడు మ్యాచ్‌లు.. మే4న కోల్‌కతా నైట్‌రైడర్స్, మే 12న చెన్నై సూపర్ కింగ్స్, మే 16న పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది.
ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి నిష్ర్కమించడంతో.. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంతో ఈ సీజన్‌ను ముగించాలని ఆర్ఆర్ భావిస్తోంది. ఇప్పుడు అదే కోల్‌కతా, పంజాబ్ జట్లను కలవరపెడుతోంది.
కోల్‌కతా నైట్‌రైడర్స్..
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 10 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా మరో ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఆ జట్టు ఖాతాలో 9 పాయింట్లు ఉండగా నెట్‌రన్‌రేట్ +0.271గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది.
ఈ సీజన్‌లో కేకేఆర్ మరో నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తేనే ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకునేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే.. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో ఓ మ్యాచ్ రాజస్థాన్‌తో ఆడనుంది. ఇప్పటికే ఆర్ఆర్ ప్లేఆఫ్స్ రేసులో లేకపోవడంతో ఆ జట్టు ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో ఒత్తిడి అంతా కేకేఆర్ పైనే ఉంటుంది.
పంజాబ్ కింగ్స్..
కోల్‌కతాతో పోలిస్తే పంజాబ్ కింగ్స్ పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆ జట్టు 10 మ్యాచ్‌లు ఆడింది. 6 మ్యాచ్‌ల్లో గెలించింది. మరో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. 13 పాయింట్లు పంజాబ్ ఖాతాలో ఉండగా నెట్‌రన్‌రేట్ +0.199గా ఉంది. ఈ సీజన్‌లో పంజాబ్ మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో కనీసం రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించినా.. ప్లేఆఫ్స్‌లో అడుగుపెటుంది.
అయితే.. పాయింట్ల పట్టికలో టాప్-2తో ప్లేఆఫ్స్‌కు చేరుకుంటే అదనపు ప్రయోజనం ఉన్న సంగతి తెలిసిందే. టాప్-2 జట్లకు ఫైనల్ చేరుకునేందుకు రెండు అవకాశాలు ఉంటాయి. అదే 3,4వ స్థానంతో ప్లేఆఫ్స్ కు చేరుకుంటే అన్ని మ్యాచ్‌లు డూ ఆర్ డైలాగానే ఉంటాయి. ఈ క్రమంలో టాప్-2లో ఉండి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలని పంజాబ్ భావిస్తోంది. దీంతో రాజస్థాన్‌తో మ్యాచ్ కూడా పంజాబ్ కు చాలా ముఖ్యం కానుంది.
చెన్నై సూపర్ కింగ్స్..
ఐపీఎల్ 2025 సీజన్‌లో అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించిన మొదటి జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కావడం గమనార్హం. ఈ క్రమంలో రాజస్థాన్, చెన్నై జట్ల మధ్య జరిగే మ్యాచ్ నామమాత్రమే. అయితే.. ఇరు జట్లు కూడా పాయింట్ల పట్టికలో తమ స్థానాలను మెరుగుపరచుకోవాలని భావిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు తమ స్థానాన్ని కాస్త మెరుగుపరచుకునే అవకాశం ఉంది.