Is there any rain on ENG vs IND 5th test day 2
లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య గురువారం నుంచి ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. తొలి రోజు ఆటలో వరుణుడు పలుమార్లు అడ్డంకిగా మారాడు. దీంతో మొదటి రోజు 64 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మేఘావృతమై ఉన్న వాతావరణం ఇంగ్లాండ్‌కు అనుకూలంగా మారగా భారత జట్టుకు తీవ్ర నష్టాన్ని కలిగించింది.
వాతావరణం మేఘావృతమై ఉండడంతో పిచ్ నుంచి ఇంగ్లాండ్ పేస్ బౌలర్లకు మంచి సహకారం లభించింది. అయినప్పటికి ప్రతికూల పరిస్థితుల మధ్య టీమ్ఇండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. కరున్ నాయర్ (52), వాషింగ్టన్ సుందర్ (19)లు క్రీజులో ఉన్నారు. ఇక ఇప్పుడు అందరి దృష్టి రెండో రోజు ఓవల్‌లో వాతావరణం ఎలా ఉంటుంది అన్న దానిపైనే ఉంది.
ENG vs IND : వరుసగా 15వ సారి టాస్ ఓడిపోయిన భారత్.. “రవిశాస్త్రి.. నిన్ను తప్పిస్తారు చూసుకో..”
ఇక రెండో రోజు కూడా ఆటకు వర్షం అంతరాయం కలిగించ వచ్చు. రెండో రోజు వర్షం ముప్పు 55 నుంచి 60 శాతంగా ఉంది. మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు) ప్రారంభం అవుతుంది. అక్కడి సమయం ప్రకారం మధ్యాహం 2 గంటలకు 46 శాతం, 3 గంటలకు 49 శాతం, సాయంత్రం 4 గంటలకు 54 శాతం, 5 గంటలకు 29 శాతం, సాయంత్రం 6 గంటలకు 24 శాతం వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ఆక్యూవెదర్ తెలిపింది.
రోజంతా మేఘావృతమై 55 నుంచి 60 శాతం వర్షం పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా ఉంటుందని తెలిపింది. ఆకాశం మేఘావృతమై ఉంటే పిచ్ నుంచి స్వింగ్ బౌలర్లకు సహకారం లభిస్తుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
కాగా.. రెండో రోజు కరుణ్ నాయర్, సుందర్ లు ఎంత సేపు ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటారు అన్న దానిపైనే టీమ్ఇండియా స్కోరు ఆధారపడి ఉంటుంది. వీరే గుర్తింపు పొందిన చివరి బ్యాటింగ్ జోడి అని చెప్పవచ్చు. ఆ తరువాత ఆకాష్‌దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ వంటి టెయిలెండర్లు మాత్రమే ఉన్నారు.