ENG vs IND : వరుసగా 15వ సారి టాస్ ఓడిపోయిన భారత్.. “రవిశాస్త్రి.. నిన్ను తప్పిస్తారు చూసుకో..”
అంతర్జాతీయ క్రికెట్‌లో గతకొన్నాళ్లుగా భారత జట్టుకు టాస్ కలిసిరావడం లేదు.

ENG vs IND 5th test Ravi Shastri You Will Be Sacked says Michael Atherton
అంతర్జాతీయ క్రికెట్‌లో గతకొన్నాళ్లుగా భారత జట్టుకు టాస్ కలిసిరావడం లేదు. శుభ్‌మన్ గిల్ సైతం వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ టాస్ ఓడిపోయాడు. కాగా.. భారత జట్టు ఇప్పటి వరకు వరుసగా 15 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీంతో టీమ్ఇండియా మాజీ ఆటగాడు రవిశాస్త్రిని తప్పిస్తారంటూ సహ కామెంటేటర్ మైకేల్ అథర్టన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
గురువారం లండన్‌లోని ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. రెగ్యులర్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ గాయపడడంతో ఓలీ పోప్ సారథ్యం చేపట్టాడు. అతడు కాయిన్ వేసి టాస్ గెలిచాడు. కెప్టెన్ మారినా కూడా ఆ జట్టు టాస్‌లో మాత్రం గెలుస్తూనే ఉంది. అదే సమయంలో గిల్ మాత్రం ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క సారి కూడా టాస్ గెలవలేదు.
ఈ సిరీస్‌లో టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. అతడు కెప్టెన్లతో పాటు టాస్ వేసేందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రిని ఉద్దేశించి ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైకెల్ అథర్టన్ సరదాగా వ్యాఖ్యలు చేశాడు. “టీమ్ఇండియా టాస్ ఓడిపోవడంలో నవ్వు బాధ్యుడివే.. నిన్ను తప్పిస్తారు చూసుకో.” అని అన్నాడు. దీనిపై రవిశాస్త్రి స్పందించాడు.. కాయిన్ నేలపై పడిన తరువాత కనీసం గిల్ అటు వైపు చూడడం లేదన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (52), వాషింగ్టన్ సుందర్ (19)లు క్రీజులో ఉన్నారు.
భారత బ్యాటర్లలో సాయి సుదర్శన్ (38), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (21) లు ఫర్వాలేదనిపించగా యశస్వి జైస్వాల్ (2), కేఎల్ రాహుల్ (14), రవీంద్ర జడేజా (9) లు విఫలం అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో గస్ అటిస్కన్, జోష్ టంగ్ లు చెరో రెండు వికెట్లు తీశారు. క్రిస్ వోక్స్ ఓ వికెట్ సాధించాడు.