ENG vs IND : యశస్వి జైస్వాల్ సమస్య అదే.. ఐదో టెస్టులో విఫలం అయిన తరువాత సునీల్ గవాస్కర్ కామెంట్స్..
టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి విఫలం అయ్యాడు.

ENG vs IND 5th test Gavaskar slams Jaiswal following the youngster poor batting
టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి విఫలం అయ్యాడు. ఇంగ్లాండ్‌తో ఓవల్ వేదికగా గురువారం ప్రారంభమైన ఐదో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 2 పరుగులకే ఔట్ అయ్యాడు. 9 బంతులు ఎదుర్కొన్న అతడు గస్ అట్కిన్సన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో అతడి పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్.. యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ టెక్నిక్‌లో కాస్త లోపం ఉందన్నాడు. ఈ కారణంగానే జైస్వాల్ విఫలం అవుతున్నాడని చెప్పుకొచ్చాడు.
ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో సెంచరీ సాధించిన యశస్వి జైస్వాల్ ఆ తరువాత గాడి తప్పాడు. ఘోరంగా విఫలం అవుతున్నాడు. నిలకడగా ఆడడం లేదు. అతడిలో ఆత్మవిశ్వాసం లోపించిందని, ఫ్రంట్ ఫుట్‌ను వేగంగా ముందుకు తీసుకురాలేకపోతున్నాడని గవాస్కర్ తెలిపాడు. అతడి బ్యాటింగ్ టెక్నిక్ పై పని చేయాల్సిన అవసరం ఉందన్నాడు.
“జైస్వాల్ ఆటలో కొద్దిగా అనిశ్చితి కనిపిస్తోంది. బహుశా అతని ఆత్మవిశ్వాసం లోపించిందనుకుంటా. తొలి టెస్టులో సెంచరీ సాధించిన అతడు.. ఆ తరువాత నిలకడగా రాణించడం లేదు. “అని సోని స్పోర్ట్స్‌లో మాట్లాడుతూ గవాస్కర్ అన్నాడు.
అతను తన ఫ్రంట్ ఫుట్‌ను వేగంగా ముందుకు తీసుకురాలేకపోతున్నాడు. అయినప్పటికి అతడు అద్భుతమైన ఆటగాడు. అతడితో ఎవరైన కూర్చొని తన బ్యాటింగ్‌లోని టెక్నిక్‌లోని లోపాలను సవరించాలి. ముఖ్యంగా అతడు ఫ్రంట్ ఫుట్‌ను ముందుకు తీసుకురావడం గురించి మాట్లాడాలి అని గవాస్కర్ తెలిపాడు.
అతడు భుజాన్ని ఎక్కువగా ఓపెన్ చేయకుండా ఉండాలన్నాడు. ప్రస్తుతం అతడి వెనుక భుజం ఫస్ట్ స్లిప్, సెకండ్ స్లిప్ వైపు ఉంటుందన్నాడు. ఇలా ఉంటే.. బ్యాట్‌ను వేగంగా కిందకు తీసుకురావడం కష్టమవుతుందని చెప్పాడు. అలా కాకుండా అతడి భుజం వికెట్ కీపర్, ఫస్ట్ స్లిప్ వైపు ఎక్కువగా ఉంటే.. బ్యాట్ ఈజీగా కిందకు తీసుకురావచ్చునని తెలిపాడు.
ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు యశస్వి జైస్వాల్ 9 ఇన్నింగ్స్‌ల్లో 32.55 సగటుతో 293 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు అర్థశతకాలు ఉన్నాయి.
ఇక టెస్టు మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (52), వాషింగ్టన్ సుందర్ (19)లు క్రీజులో ఉన్నారు.