WCL 2025 : ఏబీ డివిలియర్స్ సూపర్ ఫీల్డింగ్.. ఉత్కంఠ పోరులో పరుగు తేడాతో ఆసీస్ పై విజయం.. ఫైనల్‌కు దక్షిణాఫ్రికా..
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 సీజన్‌లో దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ ఫైనల్‌కు చేరింది.

South Africa Champions won by 1 run and enter into WCL 2025 final
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 సీజన్‌లో దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ ఫైనల్‌కు చేరింది. గురువారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌తో జరిగిన ఉత్కఠ మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో డబ్ల్యూసీఎల్‌లో తొలిసారి ఫైనల్‌లో అడుగుపెట్టింది. శనివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది.
ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కెప్టెన్ ఏబీ డివిలియర్స్(6) విఫలమైనా స్మట్స్(57; 41 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), వాన్ వైక్(76; 35 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో పీటర్ సిడల్ నాలుగు వికెట్లు తీశాడు. డి ఆర్సీ షార్ట్ రెండు వికెట్లు పడగొట్టాడు. బ్రెట్ లీ, క్రిస్టియన్‌లు చెరో ఓ వికెట్ సాధించారు.
అనంతరం క్రిస్టియన్(49), క్రిస్ లిన్(35) డిఆర్సీ షార్ట్ (33), షాన్ మార్ష్(25) లు రాణించడంతో లక్ష్య ఛేదనలో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో హార్డస్ విల్జోయెన్, వేన్ పార్నెల్ లు చెరో రెండు వికెట్లు తీశారు. ఇమ్రాన్ తాహిర్, డ్యుయాన్ ఆలివర్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
ఆఖరి ఓవర్‌లో 14 పరుగులు అవసరం కాగా..
ఆస్ట్రేలియా విజయానికి ఆఖరి ఓవర్‌లో 14 పరుగులు అవసరం అయ్యాయి. ఈ ఓవర్‌ను వేన్ పార్నెల్ వేశాడు. స్ట్రైకింగ్‌లో ఉన్న క్రిస్టియన్ తొలి బంతికి సిక్స్ కొట్టాడు. రెండో బంతికి సింగిల్ తీశాడు. ఆ తరువాత మూడో బంతికి రెండు పరుగులు రాగా, ఆ తరువాతి రెండు బంతులకు రెండు సింగిల్స్ వచ్చాయి. దీంతో ఆసీస్ విజయానికి ఆఖరి బంతికి మూడు పరుగులు అవసరం అయ్యాయి.
AB DE VILLIERS ATHLETICISM AT 41 AGE TO HELP SA WIN BY 1 RUN. 🐐🤯 pic.twitter.com/ssFJkduRgf
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 1, 2025
ఆసీస్ బ్యాటర్ షాట్ కొట్టి పరుగులు ప్రారంభించారు. మొదటి రన్‌ను పూర్తి చేశారు. రెండో పరుగు తీస్తుండగా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ అద్భుతమైన త్రో రనౌట్ చేశాడు. ఒకవేళ ఆసీస్ బ్యాటర్లు రెండో పరుగు తీసి ఉంటే అప్పుడు మ్యాచ్ టైగా ముగిసేది.