Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి ఓటమిని చవిచూసింది. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. కాగా.. ఈ మ్యాచ్‌లో ఓ ఘటన చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు జస్‌ప్రీత్ బుమ్రా, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ కరుణ్ నాయర్ లు గొడవ పడ్డారు. ఒకరిపై మరొకరు నోరు పారేసుకున్నారు.
అసలేం జరిగిందంటే..?
ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన కరుణ్ నాయర్ ముంబై బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొన్నాడు. ఎడాపెడా బౌండరీలు బాదాడు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ పేసర్ అయిన బుమ్రా బౌలింగ్‌లో ఈజీగా సిక్సర్లు, ఫోర్లు బాదాడు.
బుమ్రా వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టి 11 పరుగులు రాబట్టాడు కరుణ్‌నాయర్. అంతేకాకుండా బుమ్రా వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాది 18 పరుగులను పిండుకున్నాడు. ఈ క్రమంలో 22 బంతుల్లోనే కరుణ్ నాయర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
కాగా.. ఈ ఓవర్‌లో పరుగు తీసే క్రమంలో చూసుకోకుండా బుమ్రాను కరుణ్ నాయర్ ఢీ కొట్టాడు. వెంటనే అతడికి క్షమాపణలు చెప్పాడు. అయితే.. తన బౌలింగ్‌లో బౌండరీలు బాదుతున్నాడన్న కోపంలో ఉన్న బుమ్రా అతడిపై నోరు పారేసుకున్నాడు. దీంతో ఆగ్రహానికి లోనైన కరుణ్ నాయర్ అతడికి ధీటుగా సమాధానం ఇచ్చాడు.
ROHIT SHARMA’s REACTION 😀🔥 pic.twitter.com/ZyPzY8KLNB
— Johns. (@CricCrazyJohns) April 13, 2025
ఈ క్రమంలో వారి మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటుచేసుకుంది. అంపైర్లు జోక్యం చేసుకుని ఇద్దరికి సర్ది చెప్పారు. తన తప్పులేదని కరుణ్ నాయర్ ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు వివరణ ఇచ్చాడు. ఓ వైపు ఈ గొడవ జరుగుతుండగా రోహిత్ శర్మ ఫన్నీ రియాక్షన్‌తో నవ్వులు పూయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో కరుణ్ నాయర్ 40 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 5 సిక్సర్లు బాది 89 పరుగులు చేశాడు.
మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ (59; 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. సూర్యకుమార్ యాదవ్ (40; 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రికిల్‌టన్ (41; 25 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), నమన్ ధీర్ (38 నాటౌట్; 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టారు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. ముకేశ్ కుమార్ ఓ వికెట్ సాధించాడు.
అనంతరం లక్ష్య ఛేదనలో ఢిల్లీ 19 ఓవర్లలో 193 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ బ్యాటర్లలో కరుణ్ నాయర్ (89; 40 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీ బాదాడు. అభిషేక్ పోరెల్ (33) రాణించాడు. మిగిలిన వారు విఫలం అయ్యారు. ముంబై బౌలర్లలో కర్ణ్ శర్మ మూడు వికెట్లు తీశాడు. మిచెల్ సాంట్నర్ రెండు వికెట్లు పడగొట్టారు. జస్‌ప్రీత్ బుమ్రా ఓ వికెట్ సాధించాడు.