KL Rahul comments after india lost match to South Africa in 2nd ODI
IND vs SA : రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ పరాజయం పాలైంది. 358 పరుగుల భారీ స్కోరు చేసినా కూడా టీమ్ఇండియా ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా.. తమ ఓటమికి గల కారణాలను టీమ్ఇండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ వెల్లడించాడు. ఫీల్డింగ్‌లో కొన్ని తప్పిదాలు చేయడంతో పాటు ఇంకొన్ని అదనపు పరుగులు చేయలేకపోవడంతోనే తాము ఓడిపోయామన్నాడు.
మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా ఉందన్నాడు. రెండో ఇన్నింగ్స్ సమయంలో విపరీతమైన మంచు ఉంది. దీంతో బౌలర్లకు బంతిపై పట్టు దొరకలేదు. ఈ క్రమంలో బౌలర్లు బౌలింగ్ చేసేందుకు ఎంతో ఇబ్బంది పడ్డారని అన్నాడు. ఇక అంపైర్లు బంతిని మార్చినప్పటికి కూడా మంచు ప్రభావం తగ్గలేదన్నాడు.
Team India new Jersey : టీ20 ప్రపంచకప్ 2026కు టీమ్ఇండియా కొత్త జెర్సీ చూశారా? అదిరిపోయింది అంతే..
ఇక వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ టాస్ ఓడిపోవడం గురించి మాట్లాడుతూ.. టాస్ ఓడిపోయినందుకు, ఓటమికి తానే బాధ్యత తీసుకుంటానని అన్నాడు. డ్యూ ఫ్యాక్టర్ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో మరో 20 నుంచి 25 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. ఇక ఫీల్డింగ్‌లోనూ కొన్ని తప్పిదాలను చేశామని, కొన్ని పరుగులు ఆపాల్సి ఉందన్నాడు.
ఇక బ్యాటింగ్‌లో శతకాలతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీలపై కేఎల్ రాహుల్ ప్రశంసల వర్షం కురిపించాడు. వారిద్దరు అద్భుతంగా ఆడారన్నాడు. కోహ్లీ ట్రేడ్ మార్క్ చూపించాడని, రుతురాజ్ స్పిన్నర్లను చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడని తెలిపాడు. లోయర్ ఆర్డర్ మరింత మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. ఇక తాను బ్యాటింగ్ ఆర్డర్‌లో ఐదో స్థానంలో రావడంపై స్పందిస్తూ.. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించాడు.
మ్యాచ్ విషయానికి వస్తే.. విరాట్ కోహ్లీ (102; 93 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (105; 83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (66 నాటౌట్; 43 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ బాదాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు వికెట్లు తీశాడు. నాంద్రే బర్గర్, లుంగి ఎంగిడి లు చెరో వికెట్ పడగొట్టారు.
IND vs SA : దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. భారత జట్టు ఇదే.. గిల్‌కు చోటు కానీ చిన్న ట్విస్ట్
ఆ తరువాత ఐడెన్ మార్‌క్రమ్ (110; 98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ చేయగా.. డెవాల్డ్ బ్రెవిస్ (54; 34 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లు), మాథ్యూ బ్రీజ్కే (68; 64 బంతుల్లో 5 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో రాణించడంతో 359 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి అందుకుంది. టీమ్ఇండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో రెండు వికెట్లు తీశారు. హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్‌లు తలా ఓ వికెట్ పడగొట్టాడు.