లార్డ్స్‌లో ఇండియా వర్సెస్ ఇంగ్లాడ్ టెస్ట్ మ్యాచ్.. టికెట్ ధర పెంపుపై వివాదం.. ఎందుకంటే?
2025 జూన్ 20 నుంచి భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో మూడో మ్యాచ్ జూలై 10 నుంచి లార్డ్స్ లో జరగనుంది.

Lord's Cricket Ground
Lords Cricket Ground: మేరిలోబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) వచ్చే ఏడాది భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న లార్డ్స్ టెస్ట్ తొలి మూడు రోజుల మ్యాచ్ వీక్షించేందుకు కనీస టికెట్ ధర 90 యూరోల (సుమారు రూ. 8,400)గా నిర్ణయించింది. ఈ నిర్ణయం తీవ్ర స్థాయిలో విమర్శలకు తావునిస్తోంది. ప్రధాన స్టాండ్ ల టికెట్ల ధర రూ. 120 యూరో నుంచి రూ. 175 యూరోలు (రూ.11,200 నుంచి రూ.16,300) వరకు పెంచేసింది.
2025 జూన్ 20 నుంచి భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో మూడో మ్యాచ్ జూలై 10 నుంచి లార్డ్స్ లో జరగనుంది. ఈ మ్యాచ్ ను ప్రేక్షకులు స్టేడియంకు వచ్చి వీక్షించేందుకు భారీగా టికెట్ ధరను పెంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత నెలలో శ్రీలంకతో జరిగిన టెస్టు కోసం ప్రధాన స్టాండ్ల టికెట్ ధరను రూ.10,730 నుంచి రూ. 13,065గా నిర్ణయించారు. దీంతో స్టేడియంకు వచ్చి మ్యాచ్ ను వీక్షించేందుకు ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపలేదు. కేవలం 9వేల మంది ప్రేక్షకులు మాత్రమే మ్యాచ్ ను చూసేందుకు స్టేడియంకు వచ్చారు. స్టేడియం సామర్థ్యంలో మూడింట ఒక వంతు మాత్రమే ప్రేక్షకులు హాజరయ్యారు. దీంతో ఎంసీసీపై విమర్శలు రావడంతో.. టికెట్ ధరను కొంతమేర తగ్గించినా అప్పటికే ఆలస్యమైంది. శ్రీలంక టెస్ట్ తరువాత ఇంగ్లండ్ స్టాండ్ ఇన్ కెప్టెన్ అలీ పోప్ స్టేడియంకు తక్కువ మంది ప్రేక్షకులే హాజరుకావడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ మధ్య జరిగే టెస్టు మ్యాచ్ కు కూడా ఎంసీసీ టికెట్ ధరను భారీగా పెంచేసింది. దీంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంసీసీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్, సెక్రటరీ గై లావెండర్ మాట్లాడుతూ.. నాలుగు రోజుల టికెట్ ధర విధానాన్ని మళ్లీ సరి చేస్తామని చెప్పాడు. ఇంగ్లాండ్ టెస్ట్ క్యాలెండర్ ప్రకారం.. ఆస్ట్రేలియా తరువాత అతిపెద్ద విజిటింగ్ జట్టు టీమిండియానే. ఈ కారణంచేత టికెట్ ధరలు ఎక్కువగానే ఉండొచ్చునని చెప్పారు. కానీ, టికెట్ ధరల పెంపు విమర్శలు రావడంతో ధరలను కొంతమేర తగ్గిస్తామని చెప్పాడు. ఇదిలాఉంటే.. లార్డ్స్ లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ 2025 మ్యాచ్ కోసం టికెట్ ధర రూ. 6,530 నుంచి రూ. 12,130గా నిర్ణయించారు.