Mohammed Shami Breaks Silence On Australia ODIs Snub
Mohammed Shami : టీమ్ఇండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ కెరీర్ ఇప్పుడు డోలాయమానంలో పడింది. దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ తరుపున చివరి సారిగా ఆడాడు. ఆ తరువాత ఫిట్‌నెస్ సమస్యలలో జట్టుకు దూరం అయ్యాడు. దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్ తరుపున ఆడుతున్నప్పటికి కూడా బీసీసీఐ సెలెక్టర్లు అతడిని పట్టించుకోలేదు. ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు అతడిని ఎంపిక చేయలేదు.
దీంతో షమీ కెరీర్ ఇక ముగిసినట్లేనని, మళ్లీ జాతీయ జట్టులో అతడిని చూసే అవకాశాలు దాదాపుగా లేనట్లేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో షమీ మాట్లాడుతూ.. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి మళ్లీ టీమ్ఇండియాలో రీ ఎంట్రీ ఇస్తానన్న ధీమాను వ్యక్తం చేశాడు.
ఆస్ట్రేలియా పర్యటనకు తనను ఎంపిక చేయకపోవడంపై స్పందించాలని చాలా మంది కోరుతున్నారని షమీ తెలిపాడు. ఇప్పటికే ఈ విషయం పై సోషల్ మీడియాలో రూమర్లు, మీమ్స్ వచ్చాయన్నాడు. ఎంపిక అనేది తన చేతుల్లో ఉండదన్నాడు. అది సెలక్షన్ కమిటీ బాధ్యత అన్నాడు. టీమ్ కెప్టెన్, కోచ్‌లకు తన అవసరం ఉందని అనిపిస్తే ఎంపిక చేస్తారన్నాడు.
ఫిట్‌నెస్ గురించి ఏమన్నాడంటే..?
ఆస్ట్రేలియా సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన సమయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. షమీ ఫిట్‌నెస్ పై తమకు ఎలాంటి సమాచారం లేదన్నాడు. దీనిపై షమీ మాట్లాడుతూ.. తన ఫిట్‌నెస్ చాలా బాగుందన్నాడు. తాను దులీఫ్ ట్రోఫీలో ఆడానని, ఎంతో సౌకర్యవంతంగా ఉన్నానన్నాడు. దాదాపు 35 ఓవర్ల పాటు బౌలింగ్ చేశానని, తనకు ఎలాంటి ఫిట్‌నెస్ సమస్యలు లేవని చెప్పుకొచ్చాడు.
వన్టే కెప్టెన్‌గా గిల్ ఎంపిక పై..
వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో శుభ్‌మన్ గిల్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించడం పై కూడా షమీ స్పందించాడు. ఇందులో తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు. బీసీసీఐ, సెలెక్టర్లు, కోచ్‌లు తీసుకున్న నిర్ణయం ఇది అని చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్‌కు కూడా గిల్ నాయకత్వం వహించాడన్నాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను కూడా గిల్ చక్కగా నడిపించాడని తెలిపాడు.
Smriti Mandhana : దక్షిణాఫ్రికాతో మ్యాచ్.. స్మృతి మంధానను ఊరిస్తున్న ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డు..
‘కెప్టెన్సీ అనేది ఎవరికో ఒకరికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు గిల్‌కు ఇచ్చారు. దాన్ని అంతా అంగీకరించాల్సిందే. దీనిపై అనవసర ప్రశ్నలు మంచిది కాదు. ఏదీ మన చేతుల్లో ఉండదు. కెప్టెన్‌గా ఈ రోజు ఒకరు రేపు మరొకరు ఉంటారు.’ అని షమీ అన్నాడు.