Mohammed Shami Rips Into Report Claiming His Retirement On The Heels Of Kohli Rohit
టీమ్ఇండియా సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వారం రోజుల వ్యవధిలోనే టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించారు. ఈ క్రమంలో వీరి బాటలోనే పలువురు సీనియర్ ఆటగాళ్లు పయనించే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఆటకు వీడ్కోలు చెప్పబోతున్నాడు అని ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి.
వీటిపై ఎట్టకేలకు షమీ స్పందించాడు. ఓ ఆంగ్ల మీడియా తన రిటైర్‌మెంట్ గురించి రాసిన వ్యాసాన్ని స్ర్కీన్ షాట్ తీసి దాన్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశాడు.
‘చాలా బాగుంది మహరాజ్. మీరు మీ ఉద్యోగానికి వీడ్కోలు పలికేందుకు రోజులు లెక్కబెట్టుకోండి. తర్వాత నా రిటైర్మెంట్ గురించి మాట్లాడుకోవచ్చు. మీ లాంటి వ్యక్తులు మా భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. ఆటగాళ్ల భవిష్యత్తు గురించి ఒక్కసారైనా మంచిగా చెప్పాలి. ఈ రోజు ఇది చాలా చెత్త కథనం. ఏమనుకోకండి సారీ’ అంటూ షమీ రాసుకొచ్చాడు.
షమీ భారత్ తరఫున 64 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు. 27.1 సగటుతో 229 వికెట్లు పడగొట్టాడు, ఆరుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. చివరి సారిగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ మ్యాచ్ ఆడాడు. అదే ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే.. ఆ టోర్నీలో గాయపడడంతో కొన్నాళ్లు ఆటకు దూరం అయ్యాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చినప్పటికి.. సుదీర్ఘ ఫార్మాట్ ఆడలేదు.
SRH : ఓరి నాయనో.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొత్త కష్టం..! కావ్య పాప ఇప్పుడేమి చేస్తుందో?
ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతడు ఆడతాడని ప్రచారం జరిగింది. కానీ ఆడలేదు. దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్ తరుపున రంజీ ట్రోఫీలో ఆడాడు. గతేడాది మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్లతో సత్తాచాటాడు. వచ్చే నెలలో ఇంగ్లాండ్ పర్యటనకు షమీని ఎంపిక చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇంగ్లాండ్ పిచ్‌లు పేసర్లకు స్వర్గధామం అన్న సంగతి తెలిసిందే.