SRH : ఓరి నాయనో.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొత్త కష్టం..! కావ్య పాప ఇప్పుడేమి చేస్తుందో?
శనివారం నుంచి ఐపీఎల్ 2025 రీ స్టార్ట్ కానుంది.

Courtesy BCCI
భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తల కారణంగా నిలిపివేయబడిన ఐపీఎల్ 2025 సీజన్ శనివారం నుంచి రీస్టార్ట్ కానుంది. లీగ్ వాయిదా పడడంతో చాలా మంది విదేశీ ఆటగాళ్లు వారి వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు వీరంతా తిరిగి వస్తారా? రారా? అన్న విషయంలో ఆయా ఫ్రాంఛైజీలు తీవ్ర సందిగ్ధతను ఎదుర్కొంటున్నాయి. జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ వంటి వారు రారని, ఇంకొందరు ఆటగాళ్లు నిర్ణయం తీసుకోలేదని నివేదికలు సూచించాయి.
ఇదిలా ఉంటే.. జూన్ 11 నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా ఆటగాళ్ల భాగస్వామ్యంపై క్రికెట్ ఆస్ట్రేలియా తన స్పష్టమైన వైఖరిని తెలియజేసింది. లీగ్‌లో ఆడాలా వద్దా అనేది సదరు ప్లేయర్లకే వదిలివేసినట్లు చెప్పింది. వారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మద్దతు ఇస్తామని వెల్లడించింది.
పాట్ కమిన్స్ వస్తాడా? రాడా?
జూన్ 11 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పాట్ కమిన్స్ నాయకత్వంలోనే బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో అతడు ఇప్పుడు మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఆడతాడా? లేదా అన్న విషయం పై సందిగ్దత నెలకొంది.
ఈ సీజన్‌లో ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్రమించింది. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు కేవలం 3 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. మరో ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 7 పాయింట్లు ఉండగా నెట్‌రన్‌రేట్ -1.192గా ఉంది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.
లీగ్ దశలో ఎస్ఆర్‌హెచ్ మరో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. వీటిల్లో గెలిచానా, ఓడినా పెద్దగా జట్టుకు ప్రయోజనం ఏమీ లేకపోవడంతో కెప్టెన్ అయిన పాట్ కమిన్స్ రాకపోవచ్చునని కథనాలు వస్తున్నాయి. అతడితో పాటు స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కు కూడా మిగిలిన మ్యాచ్‌లకు దూరంగా ఉండాలని భావించవచ్చునని తెలుస్తోంది.
అదే గనుక జరిగితే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కష్టాలు మరింత పెరిగినట్లే. కమిన్స్ దూరం అయితే.. అతడి స్థానంలో ఎవరు నాయకత్వ బాధ్యతలను స్వీకరించనున్నారు అనే దానిపై అందరిలో ఆసక్తి ఉంది. హెన్రిచ్ క్లాసెన్ లేదంటే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లలో ఒకరు కెప్టెన్‌గా వ్యహరించే అవకాశం ఉందని అంటున్నారు. ఇషాన్ కు ఎస్ఆర్‌హెచ్ తరుపున ఇదే తొలి సీజన్ కావడంతో క్లాసెన్ లేదంటే అభిషేక్‌లలో ఒకరు కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.