Virat Kohli-Rohit Sharma : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వన్డే భవిష్యత్తు పై సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు.. 2027 వన్డే ప్రపంచకప్ ఆడరట..
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వన్డే భవిష్యత్తు పై సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Virat Kohli ad Rohit Sharma will not play 2027 ODI World Cup Sunil Gavaskar
టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20లతో పాటు టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఇద్దరు ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడనున్నారు. చూస్తుంటే.. వీరి లక్ష్యం 2027 వన్డే ప్రపంచకప్‌గా అర్థమవుతోంది. అయితే.. ఈ మెగాటోర్నికి మరో రెండేళ్లకు పైగా సమయం ఉంది. దీంతో ఈ మెగాటోర్నీలో వీరిద్దరు ఆడడం కష్టమేనని టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ అంటున్నారు.
ఇటీవల యూఏఈ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని భారత జట్టు గెలుచుకుంది. ఈ విజయంలో రోహిత్, విరాట్ లు కీలకపాత్ర పోషించారు. అంతకముందు 2023 వన్డే ప్రపంచకప్‌లోనూ వీరిద్దరు అద్భుతంగా రాణించారు. వరుస విజయాలతో ఆ మెగాటోర్నీలో భారత్ పైనల్ చేరుకుంది. మిగిలిన ఫార్మాట్‌లలో రోకో ద్వయం ఫామ్ ఎలాగున్నా సరే వన్డేల్లో మాత్రం అదరగొడుతున్నారు.
Virat Kohli Replacement: విరాట్ రిటైర్.. నెక్ట్స్ ఏంటి? ఈ ఐదుగురిలో టెస్టుల్లోకి వచ్చేదెవరు?
ఈ విషయంపైనే గవాస్కర్ మాట్లాడుతూ.. ఈ ద్వయాన్ని ప్రశంసించాడు. గత మూడు సంవత్సరాలుగా వీరు హై ఇంటెన్సిటీ క్రికెట్ బ్రాండ్‌ను ఆడుతున్నారు. దీన్నే మరో రెండేళ్ల పాటు వీరు కొనసాగించగలరా అని ప్రశ్నించారు.
‘వన్డేల్లో వీరు అసాధారణంగా ఆడారు. అయితే.. సెలక్షన్ కమిటీ 2027 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టును ఎంపిక చేస్తుంది. ఈ ఇద్దరూ 2027 వన్డే ప్రపంచకప్ ఆడగలరా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తుంది. ఒకవేళ వీరిద్దరు చేయగలరు అని సెలక్షన్ కమిటీ భావిస్తే ఈ ఇద్దరూ జట్టులో ఉంటారు.’ అని గవాస్కర్ అన్నారు.
అయితే.. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం మాత్రం.. వీరిద్దరు 2027 వన్డే ప్రపంచకప్‌లో స్థానం నిలబెట్టుకోగలగడం అసంభవమని అన్నారు. ‘నేను నిజాయితీగా చెబుతున్నాను. వాళ్లు ప్రపంచకప్ ఆడతారని అనుకోవడం లేదు. వచ్చే ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు వాళ్లు మంచి ఫామ్‌లో ఉండి.. సెంచరీల మీద సెంచరీలు చేస్తూ ఉంటే మాత్రం వారిని ఎవ్వరూ జట్టు నుంచి తీసివేయలేరు.’ అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
2027 వన్డే ప్రపంచ కప్ ఆడే సమయానికి రోహిత్ వయసు 40 సంవత్సరాలు కాగా, విరాట్ వయసు 38 సంవత్సరాలు ఉంటుంది. ఈ ఇద్దరిలో రోహిత్ శర్మ ఫిట్‌నెస్ పై ఆందోళన నెలకొంది. ఎందుకంటే అతడు ఐపీఎల్ 2025 సీజన్‌లోనూ ఫీల్డింగ్ చేయడం లేదు. మరోవైపు.. విరాట్ ప్రతిభ క్షీణిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల దాదాపు అన్ని మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్ ప్రారంభంలో అతడు ఇబ్బందులు పడుతున్నాడు.