Virat Kohli Replacement: విరాట్ రిటైర్.. నెక్ట్స్ ఏంటి? ఈ ఐదుగురిలో టెస్టుల్లోకి వచ్చేదెవరు?
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించాడు.

Shreyas Iyer to Sarfaraz Khan Players who can replace Virat Kohli in Tests
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. వచ్చే నెలలో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో రోహిత్ శర్మతో పాటు కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పేశారు. రోకో ద్వయం నిష్ర్కమణతో ఇంగ్లాండ్‌లో పర్యటించబోయే టీమ్ ఎంపిక సెలక్టర్లకు కత్తి మీద సాములా మారింది. కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరు అన్న దానిపైనే ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉన్న ఆటగాళ్లు ఎవరో ఓ సారి చూద్దాం..
శ్రేయస్ అయ్యర్..
అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లలో శ్రేయస్ అయ్యర్ ఒకడు. కోహ్లీ టెస్టులకు వీడ్కోలు చెప్పడంతో నాలుగో స్థానంలో అయ్యర్ సరిగ్గా సరిపోతాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు అయ్యర్ 14 టెస్టులు ఆడాడు. 35.3 సగటుతో 811 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Virat Kohli : టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ నికర ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
సర్ఫరాజ్ ఖాన్..
గత ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ ద్వారా సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగ్రేటం చేశాడు సర్ఫరాజ్ ఖాన్. అయితే.. గాయం కారణంగా అతడు జట్టుకు దూరం అయ్యాడు. ప్రస్తుతం కోలుకున్నాడు. ఇప్పటి వరకు 6 టెస్టు మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్ 37.1 సగటుతో 371 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు అర్థశతకాలు ఉన్నాయి.
కరుణ్ నాయర్..
టీమ్ఇండియా తరుపున సుదీర్ఘ ఫార్మాట్‌లో త్రిపుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడు కరుణ్ నాయర్. అయితే.. ఎందుకనో జట్టులో తన స్థానాన్ని కాపాడుకోలేకపోయాడు. గత కొన్నాళ్లుగా దేశవాలీ లో నిలకడగా రాణిస్తూ వస్తున్నాడు. కోహ్లీ రిటైర్‌మెంట్ నేపథ్యంలో నాలుగో స్థానంలో నాయర్ ఓ మంచి ఆప్షన్‌గా కనిపిస్తున్నాడు. కరుణ్ ఇప్పటి వరకు 6 టెస్టులు ఆడాడు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో 62.3 సగటుతో 374 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉంది. అత్యధిక స్కోరు 303 నాటౌట్. అది కూడా ఇంగ్లాండ్ పైనే కావడం విశేషం.
రుతురాజ్ గైక్వాడ్..
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ అయిన రుతురాజ్ గైక్వాడ్ నిలకడగా ఆడే ఆటగాళ్లలో ఒకరు. ఈ బ్యాట్స్‌మన్ ఇంకా టెస్ట్‌ల్లో అరంగేట్రం చేయలేదు, కానీ ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో విరాట్ కోహ్లీ స్థానంలో బ్యాటింగ్ చేయగలడు.
అజింక్య రహానే..
ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రిటైర్ మెంట్ ప్రకటించడంతో టీమ్ ఇండియా బ్యాటింగ్ లైనప్‌లో అనుభవం లోపించింది. మరో సీనియర్ ఆటగాడు అయిన అజింక్యా రహానే ను తీసుకుంటే.. ఇంగ్లాండ్ వంటి పరిస్థితుల్లో ఎలా ఆడాలో యువకులకు మార్గనిర్దేశ్యం చేస్తాడు. రహానే ఇప్పటి వరకు 85 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 38.5 సగటుతో 5077 పరుగులు సాధించాడు. ఇందులో 12 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
IPL 2025 : మే 16 నుంచే ఐపీఎల్..! నాలుగు వేదికల్లోనే మ్యాచ్‌లు..!