IPL 2025 : మే 16 నుంచే ఐపీఎల్..! నాలుగు వేదికల్లోనే మ్యాచ్‌లు..!
ఐపీఎల్ 2025 సీజన్ పునఃప్రారంభం ఎప్పుడెప్పుడు అవుతుందా అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Courtesy BCCI
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 సీజన్‌ను సస్సెండ్ చేసిన సంగతి తెలిసిందే. వారం రోజుల పాటు అని మొదటగా చెప్పినప్పటికి ఎప్పుడు మళ్లీ మ్యాచ్‌లు ప్రారంభం అవుతాయి అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కాల్పుల విరమణకు సంబంధించిన ప్రకటన వెలువడడంతో ఈ టోర్నీని పునఃప్రారంభించేందుకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తోంది. అయితే.. అది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది.
టోర్నీ పునఃప్రారంభం, షెడ్యూల్‌కు సంబంధించిన విషయాలను ఆదివారం ఐపీఎల్ పాలకవర్గ సభ్యులు, బీసీసీఐ అధికారులు చర్చించారు. బీసీసీఐ ప్రస్తుతం షెడ్యూల్‌ను సిద్ధం చేసే పనిలో ఉందని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. ఇప్పటి వరకు ఐపీఎల్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఐపీఎల్ ఛైర్మన్, ఫ్రాంఛైజీలతో మాట్లాడుతున్నామని చెప్పారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.
మే 16 లేదా 17న..
ఐపీఎల్ మే16న లేదా 17న పునఃప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా మిగిలిన మ్యాచ్‌లను మూడు లేదా నాలుగు వేదికల్లోనే బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ లలో నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. మిగిలిన లీగ్ మ్యాచ్‌లను డబుల్ హెడర్ (రోజుకు రెండు మ్యాచ్‌లు) గా నిర్వహించనున్నారు. జూన్ 1న ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. లక్నోసూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌తో టోర్నీ పునఃప్రారంభం కానుంది.
మరోవైపు టోర్నీ పునఃప్రారంభం కానుండడంతో మంగళవారం నాటికి ఆటగాళ్లను వెనక్కి పిలవాలని ఫ్రాంఛైజీలతో బీసీసీఐ చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఇక ఉద్రిక్తతల కారణంగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ రద్దైన సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌ను కొనసాగించడం లేదా మళ్లీ నిర్వహించడం వంటివి ఉండకపోవచ్చు. రెండు జట్లకు చెరో పాయింట్‌ను ఇచ్చే అవకాశం ఉంది.