ICC : ఇదేం సిత్రమో.. ఒకే ఇన్నింగ్స్‌లో 10 మంది బ్యాటర్లు రిటైర్డ్ ఔట్.. 8 మంది ఒక్క బాల్ కూడా ఆడలేదయ్యా..
మహిళల టీ20 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయర్స్‌లో ఓ విచిత్రం చోటు చేసుకుంది.

UAE Women retire out all ten batters in 163 run win over Qatar
మహిళల టీ20 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయర్స్‌లో ఓ విచిత్రం చోటు చేసుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఒకే జట్టులోని పది మంది బ్యాటర్లు రిటైర్డ్ ఔట్ అయ్యారు. ఇందులో 8 మంది బ్యాటర్లు కనీసం ఒక్క బాల్ కూడా ఆడకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్కోర్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన యూఏఈ, ఖతార్ మహిళల జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో యూఏఈ తొలుత బ్యాటింగ చేసింది. ఓపెనర్లు ఈషా ఓజా (113; 55 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సర్లు), తీర్థ సతీష్ (74; 42 బంతుల్లో 11 ఫోర్లు) దంచికొట్టడంతో యూఏఈ 16 ఓవర్లు ముగిసే సరికి 192/0 స్కోరుతో నిలిచింది. ఈ దశలో యూఏఈ సంచలన నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు నేపథ్యంలో ప్రత్యర్థిని త్వరగా బ్యాటింగ్ దించి, కనీసం ఐదు ఓవర్లు అయినా ఆడించి మ్యాచ్ ఫలితం తేలేలా చేయాలని భావించింది.
A unique tactic from UAE at the Women’s #T20WorldCup Asia Qualifier with 10 batters ‘Retired Out’ in a massive 163-run victory 😲
Check how it all transpired 👇https://t.co/mA95gYToQE
— ICC (@ICC) May 10, 2025
అంతే అనుకున్నదే తడవుగా.. తొలుత ఇషా ఓజా రిటైర్ ఔట్ అయింది. ఆ తర్వాత త్రితా సతీష్ కూడా రిటైర్ ఔట్ అయింది. ఇలా ఒకరితరువాత మరొకరు క్రీజులో వచ్చి రిటైర్డ్ ఔట్ అయ్యారు. ఇలా 10 మంది ప్లేయర్లు రిటైర్డ్ ఔట్‌గా నిలిచారు. ఇందులో ఓపెనర్లు మినహా మిగిలిన 8 మంది బ్యాటర్లు కనీసం ఒక్క బంతి కూడా ఆడలేదు. దీంతో వీరంతా డకౌట్లు అయినట్లు అయింది. కాగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో పురుషుల, మహిళల క్రికెట్‌లో ఇలా 10 మంది రిటైర్డ్ ఔట్ కావడం ప్రపంచ రికార్డు.
ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఓ జట్టు ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసేందుకు అవకాశం లేదు. ఓవర్లు పూర్తిగా అన్నా ఆడాలి లేదంటే ఆలౌట్ కావాల్సిందే. అందుకనే యూఏఈ బ్యాటర్లు రిటైర్డ్ ఔట్ అయ్యారు.
ఫలించిన ప్లాన్..
యూఏఈ ప్లాన్ పలించింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఖతార్ జట్టు 11.1 ఓవర్లలో 29 పరుగులకే కుప్పకూలింది. దీంతో యూఏఈ ఏకంగా 163 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. యూఏఈ బౌలర్లలో మిచెల్లీ బోథా మూడు వికెట్లు తీయగా, కేటీ థాంప్సన్ రెండు వికెట్లు పడగొట్టింది.
ఇక ఈ మ్యాచ్‌లో ఇరు జట్లలోని మొత్తం ఆటగాళ్లలో 15 మంది డకౌట్ కావడం గమనార్హం.