PSL 2025 : ఎవరు ఏమైనా చెప్పండి.. జన్మలో పాక్‌లో అడుగుపెట్టనన్న మిచెల్.. చిన్నపిల్లాడిలా ఏడ్చిన టామ్ కరన్.. పీఎస్ఎల్‌లో విదేశీ క్రికెటర్ల అనుభవాలు..
విదేశీ ఆటగాళ్లు పాక్ నుంచి దుబాయ్ చేరే వరకు భయం భయంగా గడిపారట.

Terrified PSL 2025 bound NZ star after rushing back to Dubai following India Pakistan conflict
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో బీసీసీఐ ఐపీఎల్‌ను మధ్యలోనే నిలిపివేసింది. ఓ వారం పాటు వాయిదా వేసింది. అదే సమయంలో అటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సైతం పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)ను నిలిపివేసింది. ఈ క్రమంలో పీఎస్ఎల్‌లో పాల్గొన్న ఆటగాళ్లు స్వదేశాలకు బయలుదేరారు. అయితే.. విదేశీ ఆటగాళ్లు పాక్ నుంచి దుబాయ్ చేరే వరకు భయం భయంగా గడిపారట.
దుబాయ్‌లో అడుగుపెట్టిన వెంటనే న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్ ఇకపై ఎన్నడూ కూడా పాక్‌లో అడుగుపెట్టనని వ్యాఖ్యానించాడట. ఇంగ్లాండ్ ఆటగాడు టామ్ కుర్రాన్ చిన్న పిల్లాడిలా ఏడ్చాడట. ఈ విషయాలను బంగ్లాదేశ్ ఆల్‌రౌండర రిషాద్ హోస్సేన్‌ను వెల్లడించాడు.
‘సామ్ బిల్లింగ్స్, డారిల్ మిచెల్, కుశాల్ పెరెరా, డేవిడ్ వైస్, టామ్ కుర్రాన్ వంటి విదేశీ ఆటగాళ్ళు.. అందరూ చాలా భయపడ్డారు. దుబాయ్‌లో అడుగుపెట్టిన వెంటనే మిచెల్ మాట్లాడుతూ తాను ఇకపై పాకిస్తాన్‌కు వెళ్లనని చెప్పాడు. ప్రస్తుత పరిస్థితులను చూసి వారంతా భయబ్రాంతులకు గురి అయ్యారు.’ అని రిషాద్ తెలిపాడు.
విదేశీ ఆటగాళ్ళు ఎంత భయపడ్డారో బంగ్లాదేశ్ స్పిన్నర్ వివరించాడు. ఇంగ్లాండ్ క్రికెటర్ టామ్ కుర్రాన్ చిన్నపిల్లాడిలా ఏడ్చాడని, అతడిని ముగ్గురు, నలుగురు కలిసి ఓదార్చారని చెప్పుకొచ్చాడు. ‘అతను (టామ్ కుర్రాన్) విమానాశ్రయానికి వెళ్లాడు. అయితే.. అప్పటికే విమానాశ్రయం మూసివేయబడిందని చెప్పడంతో అతడు చిన్న పిల్లవాడిలా ఏడవడం ప్రారంభించాడు. అతడిని ఓదార్చేందుకు ముగ్గురు, నలుగురు వ్యక్తులు అవసరం అయ్యారు.’ అని రిషాద్ అన్నాడు.
మా దేశానికి (బంగ్లాదేశ్)కే చెందిన ఫాస్ట్‌బౌలర్ నహిద్ రాణా స్థానువులా ఉండిపోయాడు. బహుశా అతడు టెన్షన్ పడుతున్నాడని నాకు అర్థమైంది. భయపడకు, ఏమీ కాదని నేను అతడికి ధైర్యం చెప్పా. చివరికి మేము సురక్షితంగా దుబాయ్‌కు చేరుకున్నాము. అని రిషాద్ వెల్లడించాడు.
ఇక తాము దుబాయ్‌లో దిగిన తర్వాత.. మేం పాక్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన 20 నిమిషాలకు సదరు విమానాశ్రయానికి సమీపంలో క్షిపణి దాడి జరిగిందని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్నాక అందరం ఎంతో భయపడిపోయాం అని రిషాద్ తెలిపాడు.