Virat Kohli-Rohit Sharma : వార్నీ.. అన్ని నెలలు ఆగాలా.. కోహ్లీ, రోహిత్ లను టీమ్ఇండియా జెర్సీలో చూసేందుకు..
టీ20లు, టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించిన నేపథ్యంలో వన్డేల్లో మాత్రమే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను భారత జెర్సీలో చూసే అవకాశం ఉంది.

When will Virat Kohli and Rohit Sharma play ODIs together in 2025
వారం రోజుల వ్యవధిలోనే టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లు టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించారు. గతేడాది టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా భారత్ నిలిచిన వెంటనే పొట్టి ఫార్మాట్‌కు వీరు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక పై వీరిద్దరు కేవలం వన్డేల్లో మాత్రమే కనిపించనున్నారు.
ప్రస్తుతం వీరిద్దరు ఐపీఎల్‌లో ఆడుతున్నారు. ముంబై ఇండియన్స్ కు రోహిత్ శర్మ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు విరాట్ కోహ్లీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. భారత్, పాక్ ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడ్డ ఐపీఎల్ 2025 సీజన్ శనివారం (మే 17) నుంచి పునఃప్రారంభం కానుంది. జూన్ 3న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఐపీఎల్ ముగిసిన తరువాత భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పడంతో కోహ్లీ, రోహిత్‌లు ఈ సిరీస్‌లో ఆడరు. ఇక వీరిద్దరిని భారత జెర్సీలో మైదానంలో చూడాలంటే ఆగస్టు వరకు వెయిట్ చేయాల్సిందే.
ఆగస్టులో భారత జట్టు బంగ్లాదేశ్‌తో పర్యటించనుంది. ఈ పర్యటనలో బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు ఆడనుంది. ఆగస్టు 17న ఢాకా వేదికగా తొలి వన్డే జరగనుంది. రెండో వన్డే ఆగస్టు 20న, మూడో వన్డే ఆగస్టు 23న జరనున్నాయి. అయితే.. ఆ దేశంలో అశాంతి కారణంగా భారత జట్టు అక్కడ పర్యటించకపోవచ్చు అనే వార్తలు వస్తున్నాయి.
ఒకవేళ భారత జట్టు బంగ్లా పర్యటనకు వెళ్లకపోతే.. రో-కో ద్వయాన్ని చూసేందుకు అక్టోబర్ వరకు ఆగాల్సిందే. అక్టోబర్ లో భారత జట్టు ఆస్ట్రేలియాలో మూడు వన్డేల సిరీస్ కోసం పర్యటించనుంది. తొలి వన్డే పెర్త్ వేదికగా అక్టోబర్ 19న, అడిలైడ్ వేదికగా అక్టోబర్ 23న రెండో వన్డే, సిడ్నీ వేదికగా అక్టోబర్ 25న మూడో వన్డే జరగనుంది.