IND Vs ENG: ఐదో టెస్టులో భారత్‌ అద్భుత విజయం తరువాత విరాట్ కోహ్లీ రియాక్షన్ ఇదే..! సిరాజ్ ఎమోషనల్ రిప్లై..

ఐదో టెస్టు చివరి రోజు ఆటలో సిరాజ్ అద్భుత ఆటతీరుపట్ల మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు.

Virat Kohli Mohammed Siraj

IND Vs ENG: ఓవల్ లో భారత జట్టు అద్భుతం సృష్టించింది. ఐదో టెస్టులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ సిరాజ్ బంతితో నిప్పులు చెరగడంతో భారత జట్టు చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో భారత జట్టు ఇంగ్లాండ్ టూర్ లో ఐదు టెస్టుల సిరీస్ ను 2-2తో సమం చేసింది. సిరాజ్ అద్వితీయ బౌలింగ్ తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐదో టెస్టు చివరి రోజు ఆటలో సిరాజ్ అద్భుత ఆటతీరుపట్ల మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు.

Also Read; ENG vs IND: టెస్ట్‌ క్రికెట్ చరిత్రలో అత్యల్ప పరుగులతో విజయం.. గతంలో ఒక్క పరుగుతో గెలిచిన 2 జట్లు ఉన్నాయ్‌.. ఫుల్ డీటెయిల్స్‌

సిరాజ్, విరాట్ కోహ్లీకి ప్రత్యేక అనుబంధం ఉంది. కెరీర్ ఆరంభం నుంచి మహమ్మద్ సిరాజ్‌కు విరాట్ కోహ్లీ అండగా నిలిచాడు. ముఖ్యంగా ఐపీఎల్ టోర్నీ ద్వారా వీరిద్దరూ అన్నదమ్ముళ్లుగా మారిపోయారు. ఆర్సీబీ జట్టులో సుదీర్ఘకాలంపాటు ఆడిన సిరాజ్‌ను కోహ్లీ వెన్నుతట్టి ప్రోత్సహించాడు. కోహ్లీ సారథ్యంలోనే టీమిండియా టెస్టు టీంలోకి సిరాజ్ ఎంట్రీ ఇచ్చాడు. సిరాజ్ విఫలమైన సందర్భాల్లోనూ కోహ్లీ అతనికి అండగా నిలిచాడు. తద్వారా సిరాజ్ స్టార్ పేసర్‌గా భారత జట్టులో కీలకమయ్యాడు. తాజాగా.. ఐదో టెస్టు ఐదోరోజు మ్యాచ్‌లో సిరాజ్ అద్భుత బౌలింగ్ పట్ల విరాట్ కోహ్లీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు సిరాజ్ ఎమోషనల్ రిప్లై ఇచ్చాడు.

Also Read: ఇంగ్లాండ్‌తో డ్రా అయ్యిందిగా.. ఇక WTC ఫైనల్‌కి టీమిండియా అర్హత సాధించాలంటే ఇప్పుడెలా? ఏం జరుగుతుందంటే?

టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్‌పై కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు. ‘‘టీం ఇండియా సాధించిన గొప్ప విజయం ఇది. సిరాజ్, ప్రసిధ్‌ల దృఢ సంకల్పం భారత జట్టుకు ఈ అద్భుతమైన విజయాన్ని అందించాయి. జట్టుకోసం ప్రతిదీ అందించే సిరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతని ప్రదర్శన తనకు గర్వంగా ఉంది’’ అంటూ కోహ్లీ ట్వీట్ చేశారు. అందుకు సిరాజ్ స్పందిస్తూ.. నామీద నమ్మకం ఉంచినందుకు థ్యాంకూ భయ్యా.. అంటూ ఎమోషనల్ రిప్లై ఇచ్చాడు. సిరాజ్ అద్భుత ఆటతీరు పట్ల క్రికెట్ ప్రముఖులతోపాటు.. ఇతర రంగాల ప్రముఖులు సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపించారు.