Most T20 runs by indian Dinesh Karthik surpasses MS Dhoni
టీమ్ఇండియా మాజీ ఆటగాడు దినేశ్ కార్తీక్ ఓ ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోని అధిగమించాడు. సౌతాఫ్రికా టీ20లో ఆడుతున్న దినేశ్ ఈ ఘనతను అందుకున్నాడు.
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025లో పార్ల్ రాయల్స్‌కు 39 ఏళ్ల దినేశ్ కార్తీక్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. సోమవారం డర్బన్ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కార్తీక్ 15 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 21 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ధోనిని అధిగమించాడు.
టీ20 క్రికెట్‌లో కార్తీక్ 26.99 సగటుతో 136.84 స్ట్రైయిక్ రేటుతో 7451 పరుగులు చేశాడు. ఇందులో 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌండరీల విషయానికి వస్తే 718 బౌండరీలు, 258 సిక్సర్లు ఉన్నాయి. ఇక ధోని టీ20 కెరీర్‌లో 38.11 సగటుతో 135.64 స్ట్రైక్‌రేటుతో 7432 పరుగులు చేశాడు. ఇందులో 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌండరీల విషయానికి వస్తే.. 517 ఫోర్లు, 338 సిక్సర్లు ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. కార్తీక్ ను అధిగమించే అవకాశం ధోనికి ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించినా కూడా ధోని ఐపీఎల్ ఆడుతున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో బరిలోకి దిగే మాత్రం కార్తీక్‌ను అధిగమించవచ్చు. మరోవైపు కార్తీక్ అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత డర్బన్ సూపర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 143 సాధించింది. డర్బన్ బ్యాటర్లలో మార్కస్ స్టోయినిస్ (40 బంతుల్లో 55 నాటౌట్) హాఫ్ సెంచరీ చేశాడు. కేన్ విలియమ్సన్ (45) రాణించాడు.
అనంతరం జోరూట్ డకౌట్ అయినా రూబిన్ హెర్మాన్ (51 బంతుల్లో 59), లువాన్-డ్రే ప్రిటోరియస్ (29 బంతుల్లో 43 పరుగులు)లతో పాటు దినేశ్ కార్తీక్ (15 బంతుల్లో 21)లు రాణించడంతో లక్ష్యాన్ని పార్ల్ రాయల్స్ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో రాయల్స్ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. ఓడిపోయిన డర్బన్ టోర్నీ నుంచి నిష్ర్కమించింది.