IND vs AUS : ఇండోర్‌లో భారత్ ఘన విజయం.. మైదాన సిబ్బందికి రూ.11లక్షల ప్రైజ్‌మనీ.. ఎందుకో తెలుసా..?
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం (Holkar Cricket Stadium) లో ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్లు రెండో వన్డేలో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ 99 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది

MPCA announces Rs 11 Lakh prize money
India vs Australia : ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం (Holkar Cricket Stadium) లో ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్లు రెండో వన్డేలో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ 99 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. తద్వారా మూడు మ్యాచుల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. కాగా.. ఈ మ్యాచ్‌కు వరుణుడు రెండు దపాలుగా అంతరాయం కలిగించాడు. వరుణుడు తెరిపినిచ్చిన తరువాత మైదాన సిబ్బంది శ్రమించి మ్యాచ్ సజావుగా సాగేలా చూశారు. దీంతో వారి కృషిని గుర్తిస్తూ మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (MPCA) గ్రౌండ్ సిబ్బందికి రూ.11లక్షల ప్రైజ్‌మనీగా ఇస్తున్నట్లు ప్రకటించింది.
రెండు సార్లు వరుణుడి ఆటంకం..
భారత ఇన్నింగ్స్ ప్రారంభమైన తరువాత 9.5 ఓవర్లు పూర్తి కాగానే వర్షం మొదలైంది. దాదాపు అరగంట పాటు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. ఇక రెండో సారి ఆసీస్ ఇన్నింగ్స్ 9 ఓవర్లు ముగియగానే వరుణుడు వచ్చేశాడు. చాలా సేపు వర్షం కురిసింది. ఈ కారణంగా 17 ఓవర్లను కుదించారు. వర్షం ప్రారంభం కాగానే గ్రౌండ్ సిబ్బంది మైదానం మొత్తాన్ని కవర్లతో కప్పేశారు. ఆ తరువాత నీటిని తీసివేసి మ్యాచ్‌కు అనువైన పరిస్థితులు కల్పించడానికి కృషి చేసినందుకు గ్రౌండ్ సిబ్బందికి రూ.11లక్షలను బహుమతిగా అందజేస్తామని మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అభిలాష్ ఖండేకర్ తెలిపారు.
IND vs AUS 3rd ODI: మూడో వన్డేకు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శుభ్‌మన్ గిల్(104), శ్రేయస్ అయ్యర్ (105) శతకాలకు తోడు సూర్యకుమార్ యాదవ్ (72 నాటౌట్) విధ్వంసం సృష్టించడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 399 పరుగులు చేసింది. అనంతరం ఆసీస్ ఇన్నింగ్స్ ఆరంభమైన 9 ఓవర్ల తరువాత వర్షం రావడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో లక్ష్యాన్ని 33 ఓవర్లలో 317 కు సవరించారు. అయితే.. ఆస్ట్రేలియా 28.2 ఓవర్లలో 217 పరుగులకే కుప్పకూలింది.