Courtesy BCCI
మోచేతి గాయం కారణంగా ఐపీఎల్ 2025 సీజన్‌లోని మిగిలిన మ్యాచ్‌ల నుంచి రుతురాజ్ గైక్వాడ్ వైదొలగడంతో చెన్నై సూపర్ కింగ్స్ నాయకత్వ బాధ్యతలను ఎంఎస్ ధోని అందుకున్నాడు. చెన్నైని ఐదు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిపిన ధోని మరోసారి తన మ్యాజిక్ ను చూపించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు..
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు చెన్నై ఐదు మ్యాచ్‌లు ఆడింది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన చెన్నై.. ఆ తరువాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ఖాతాలో రెండు పాయింట్లు ఉండగా నెట్ రన్‌రేట్ -0.889గా ఉంది.
ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే సీఎస్‌కే విజయాల బాట పట్టాల్సిందే. శుక్రవారం చెన్నైలోని చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ధోని నాయకత్వంలో బరిలోకి దిగనుండడంతో చెన్నై తలరాత మారుతుందని ఫ్యాన్స్ ఆశిస్తుండగా సీఎస్‌కే మాజీ ఆటగాడు ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని కెప్టెన్ అయినంత మాత్రన సీఎస్‌కే రాత మారదన్నాడు.
జట్టులో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటి అన్నింటిని సరిదిద్దుకోవాల్సి ఉందని అభిప్రాయ పడ్డాడు. ముఖ్యంగా ఫామ్‌లో ఉన్న రుతురాజ్ తప్పుకోవడంతో అతడి స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారో చూడాల్సి ఉందన్నాడు. రాహుల్ త్రిపాఠిని మూడో స్థానంలో బరిలోకి దించే అవకాశాన్ని కొట్టిపారేయలేమన్నాడు.
RCB vs DC : రజత్ పాటిదార్ కెప్టెన్సీ పై కోహ్లీ అసంతృప్తి..? దినేశ్ కార్తీక్‌తో సుదీర్ఘ సంభాషణ..
పంజాబ్‌తో మ్యాచ్‌లో కాన్వే ఫామ్ అందుకున్నాడు. అతడు రిటైర్డ్ ఔట్ కావడానికి ముందు 69 పరుగులు చేశాడు. ఈ సీజన్ ఆరంభం నుంచి రచిన్ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఫామ్‌లో ఉన్న రుతురాజ్ దూరం కావడం సీఎస్కేకు పెద్ద ఎదురుదెబ్బ అని ఉతప్ప అన్నాడు. ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్‌ను తుది జట్టులోకి తీసుకువచ్చే అవకాశం ఉందన్నాడు.
ఈ సవాళ్లను ధోని ఎలా అధిగమిస్తాడో చూడాల్సి ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో చెన్నై విజయాల బాట పడడం అంత ఈజీ కాదన్నాడు.