Courtesy BCCI
ఎన్నో ఆశలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ మెగావేలం 2025లో ఇషాన్ కిషన్‌ను దక్కించుకుంది. అతడి కోసం ఏకంగా 11.25 కోట్లను వెచ్చించింది. అయితే.. రాజస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో అలరించిన ఈ ఎడమచేతి వాటం ఆటగాడు ఆ తరువాత పూర్తిగా గాడి తప్పాడు. ఆ తరువాత ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఒక్కసారి మాత్రమే అతడు రెండు అంకెల స్కోరు సాధించాడు. మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యాడు.
మొత్తంగా ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన ఇషాన్ కిషన్ 23.17 సగటు 163.53 స్ట్రైక్‌రేట్‌తో 139 పరుగులు చేశాడు. గత ఎనిమిది మ్యాచ్‌ల్లో అతడు వరుసగా 106 నాటౌట్, 0, 2, 2, 17, 9 నాటౌట్, 2, 1 పరుగులు చేశాడు.
అచ్చిరాని మూడో స్థానం..
ఇషాన్ కిషన్ తన ఐపీఎల్ కెరీర్‌లో ఎక్కువగా ముంబై ఇండియన్స్ తరుపున ఆడాడు. ఎక్కువగా ఓపెనర్‌గానే బరిలోకి దిగాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లోనూ ముంబై ఓపెనర్‌గా ఆడాడు. 14 మ్యాచ్‌ల్లో 22 సగటుతో 320 పరుగులు చేశాడు. ముంబై తరుపున 84 మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా వచ్చిన అతడు 33 సగటుతో 1514 పరుగులు చేశాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇక ముంబై తరుపున మూడో స్థానంలో 11 సార్లు వచ్చాడు. 19 సగటుతో 216 పరుగులు మాత్రమే చేశాడు. నాలుగో స్థానంలో 22 సగటుతో 583 పరుగులు సాధించాడు. ఐదు, ఆరో స్థానాల్లో ఒక్కొసారి బ్యాటింగ్‌కు దిగిన ఇషాన్ అక్కడ పెద్దగా రాణించలేదు.
విఫలం కావడానికి అదే కారణమా?
ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లు ఉండడంతో ఇషాన్ కిషన్‌ను మూడో స్థానంలో బరిలో దించుతోంది సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్. ఓపెనింగ్ స్థానంలో ఖాళీ లేకపోవడంతో ఇషాన్ మూడో స్థానంలో ఆడాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఓపెనర్‌గా అద్భుతంగా రాణించే అతడు తనకు అచ్చిరాని మూడో స్థానంలో ఇబ్బంది పడుతున్నాడు అనేది స్పష్టం కనిపిస్తోంది.
దీంతో అతడు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తోంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో దీపక్ చాహర్ బౌలింగ్‌లో బంతికి బ్యాట్ తగలకపోయినా, ముంబై ఆటగాళ్లు అప్పీల్ చేయపోయినా, అంపైర్ ఔట్ ఇవ్వకపోయినా కూడా.. అతడు పెవిలియన్‌కు నడుచుకుంటూ వెళ్లిపోవడాన్ని చూశాం. టీవీ రిప్లైలో బంతికి, బ్యాట్‌కు మధ్య బానే దూరం ఉన్నట్లుగా కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
ఈ క్రమంలో ఇషాన్ కిషన్ ఎస్ఆర్‌హెచ్ అభిమానుల ఆగ్రహనికి గురి అయ్యాడు. శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు గల్లంతు అవుతాయి. దీంతో ఈ కీలక మ్యాచ్‌లో అతడు చెలరేగి ఆడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. గత మ్యాచ్‌లో లాగా.. అంపైర్ ఔట్ ఇవ్వకముందే వెళ్లిపోద్దని, సెంచరీతో జట్టును ఆదుకోవాలని కోరుతున్నారు.