RCB vs RR : గెలిచే మ్యాచ్‌లో ఓడిపోవడంపై రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్.. బెంగళూరుపై అందుకే ఓడిపోయాం..
బెంగళూరు చేతిలో ఓడిపోవడం పై రాజస్థాన్ రాయల్స్ తాత్కాలిక కెప్టెన్ రియాన్ పరాగ్ స్పందించాడు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గురువారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. తమ జట్టు ఓటమి పై రాజస్థాన్ రాయల్స్ తాత్కాలిక కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనలేకపోవడంతోనే ఓడిపోయినట్లుగా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (70), దేవ్‌దత్ పడిక్కల్ (50)లు హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆర్‌బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులకే పరిమితమైంది. ఆర్ఆర్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (49), ధ్రువ్ జురెల్ (34)లు రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ నాలుగు వికెట్లు తీశాడు.
Virat Kohli : చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ప్రపంచ క్రికెట్‌లో తొలి ఆటగాడు ఇతడే..
మ్యాచ్ అనంతరం రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో తాము బంతితో రాణించామని చెప్పాడు. ఈ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలం అని, ఇక్కడ 210 నుంచి 215 పరుగులు చేయొచ్చునని తాను భావించినట్లు తెలిపాడు. ‘కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ ఆర్‌సీబీ బాగానే కట్టడి చేశాం. సగం మ్యాచ్ ముగిసే సరికి మాకే విజయావకాశాలు ఉన్నాయి. అయితే.. మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ వైఫల్యం మా కొంప ముంచింది.’ అని రియాన్ పరాగ్ తెలిపాడు.
స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొనలేకపోయినట్లుగా చెప్పుకొచ్చాడు. ‘వారిపై దూకుడును ప్రదర్శించలేకపోయాం. జట్టు మేనేజ్‌మెంట్ ఆటగాళ్లకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చింది. ఆటగాళ్లు కూడా బాధ్యత తీసుకుని రాణించాల్సిన అవసరం ఉంది. ఈ టోర్నమెంట్‌లో చిన్న తప్పు చేసిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.’ అని పరాగ్ అన్నాడు.
‘తమ జట్టు ప్రదర్శనలపై సుదీర్ఘంగా చర్చలు జరిపాం. గత రెండు మూడు మ్యాచ్‌ల్లో గెలిచే మ్యాచ్‌ల్లో ఓడిపోయాం. మైదానంలో మా ప్రణాళికలను సక్రమంగా అమలు చేయలేకపోయాం. తదుపరి మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేస్తాం.’ అని పరాగ్ చెప్పాడు.