Sachin Tendulkar Meets Afghanistan Team
Afghanistan Team : భారత్ గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్ లో అఫ్గానిస్థాన్ జట్టు అదరగొడుతోంది. ఆ జట్టు ఆడిన ఏడు మ్యాచ్ లలో నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించింది క్రికెట్ ప్రపంచం చూపును తమవైపుకు తిప్పుకుంది. వరల్డ్ కప్ ప్రారంభంలో చివరి రెండు స్థానాల్లో ఉండే జట్టు అఫ్గాన్ జట్టు అనే అభిప్రాయాలు వినిపించాయి. కానీ, మ్యాచ్ లు జరుగుతున్నాకొద్దీ అఫ్గాన్ జట్టు పోరాటపటిమను చూసి ప్రత్యర్థి జట్లుసైతం మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా పెద్ద జట్లనుసైతం ఓడించి సెమీస్ రేసుకోసం అఫ్గాన్ జట్టు తహతహలాడుతోంది.
మంగళవారం ముంబయి వేదికగా ఆస్ట్రేలియాతో అఫ్గాన్ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ లో అఫ్గాన్ విజయం సాధిస్తే సెమీస్ ఆశలు మెరుగవుతాయి. ఓడిపోతే ఆ జట్టు సెమీస్ ఆశలు దాదాపు సన్నగిల్లినట్లే. అయితే, ఆస్ట్రేలియాతో మ్యాచ్ కు ముందు అఫ్గాన్ టీం సభ్యులతో లెజెండ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సమావేశం అయ్యారు. ప్రాక్టీస్ సెషన్ సమయంలో ఆ జట్టు సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సచిన్ అఫ్గాన్ జట్టు సభ్యులకు పలు సూచనలు చేసినట్లు తెలిసింది. సచిన్ తో సమావేశంపై అఫ్గాన్ జట్టు స్పిన్నర్ రషీద్ ఖాన్ మాట్లాడారు. సచిన్ తో మాట్లాడిన క్షణం తనతో పాటు మొత్తం జట్టు సభ్యుల ఫీలింగ్ ఏమిటో వివరించాడు.
వాంఖడేలో సచిన్ టెండూల్కర్ ను కలవడం ఒక భిన్నమైన అనుభూతి. అది చాలా ప్రత్యేకమైన సమయం. ఆస్ట్రేలియాతో మ్యాచ్ కు ముందు మా కుర్రాళ్లకు కొత్త శక్తి వచ్చినట్లయింది. సచిన్ ను కలవాలని చాలా మంది ఆటగాళ్లకు ఉంటుంది.. ఇది ఒకరకమైన కల అంటూ రషీద్ అన్నారు. ఆస్ట్రేలియాతో తమ కీలక మ్యాచ్ కు ముందు జట్టును కలిసినందుకు సచిన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలాఉంటే ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియాతో అఫ్గానిస్థాన్ జట్టు తలపడుతుంది. ఆ తరువాత శుక్రవారం అహ్మదాబాద్ లో దక్షిణాఫ్రికా జట్టుతో అఫ్గాన్ జట్టు తలపడుతుంది.