Pakistan Prime Minister will personally review on Mohammad Rizwan team Champions Trophy fiasco
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్ కథ ముగిసింది. ఆతిథ్య జట్టు కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవకుండానే టోర్నీ నుంచి నిష్క్కమించింది. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఆతిథ్య జట్టు ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవపోవడం ఇది రెండో సారి. 2000లో కెన్యాకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది.
ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా పాకిస్తాన్ బరిలోకి దిగింది. వరుసగా న్యూజిలాండ్, భారత్ చేతుల్లో ఓడిన పాకిస్తాన్ జట్టు కనీసం బంగ్లాదేశ్ పై విజయం సాధించి కాస్త అయిన ఊరట పొందాలని భావించగా వర్షం రూపంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వర్షం కారణంగా బంగ్లా, పాక్ మ్యాచ్ రద్దు అయింది. ఇరు జట్లకు ఒక్కొ పాయింట్‌ను కేటాయించారు. దీంతో పాయింట్ల పట్టికలో పాక్ ఆఖరి స్థానానికి పరిమితమైంది. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు పై ఆదేశ అభిమానులు, మాజీ ఆటగాళ్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంతలా అంటే.. ఆ దేశ ప్రధాన మంత్రి దీనిపై దృష్టి సారించేంతగా.
ఛాంపియన్స్ ట్రోఫీలో రిజ్వాన్ సేన దారుణ ఆటతీరు పై ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అసెంబ్లీ వేదికగా మాట్లాడనున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రధాని రాజకీయ, ప్రజా వ్యవహారాల సలహాదారు రాణా సనావుల్లా IANSకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘ప్రధానమంత్రి వ్యక్తిగతంగా ఈ విషయం పై దృష్టి సారించారు. పాక్ దారుణ ప్రదర్శన పై మంత్రివర్గంలో, పార్లమెంటులో ప్రస్తావించాలని ఆయనను అడుగుతాము. ‘అని సనావుల్లా అన్నారు. పాక్ బోర్డు తమ దగ్గర ఉన్న నగదును వేటికి ఎలా ఖర్చుపెడుతుందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని ఆయన తెలిపారు.
పీసీబీలోని కొందరు అధికారులు నెలకు 5మిలియన్లకు వరకు అందుకుంటున్నారని, అయితే.. వారి బాధ్యతలను నిర్వర్తించడంలో వారు విఫలం అవుతుండడాన్ని ఈ సందర్భంగా సనావుల్లా ప్రస్తావించారు.
పాక్ మాజీల ఆందోళన..
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు దారుణమైన ప్రదర్శన ఆ దేశ క్రికెట్ నిపుణులు, మాజీ ఆటగాళ్లలో ఆందోళనను రేకెత్తించింది. ఇలాంటి వైఫల్యాలకు జట్టు ఆటగాళ్ల ప్రదర్శన ఒక్కటే కారణం కాదని, పాక్ జట్టు దేశవాలీ వ్యవస్థ పూర్తిగా క్షీణించడం అని వారు చెబుతున్నారు.