Fatima Sana comments ahead of IND vs PAK match in Womens ODI World Cup 2025
Fatima Sana : మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా భారత్, పాక్ జట్లు తలపడనున్నాయి. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ మ్యాచ్ పై అందరి దృష్టి నెలకొంది. కాగా.. మ్యాచ్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాకిస్తాన్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పై ప్రశంసల వర్షం కురిపించింది. ఆమె సీనియర్ ప్లేయర్ అని, జట్టును నడిపించే తీరు అద్భుతం అని చెప్పింది. పరిస్థితులకు తగ్గట్లుగా హర్మన్ తన బ్యాటింగ్ శైలిని మార్చుకుంటుందని తెలిపింది. అవసరం అయితే హిట్టింగ్ ఆడగలదని, లేదంటే డిఫెన్స్ కూడా ఆడగలదు అని అంది.
IND vs PAK : నేడు భారత్, పాక్ మధ్య మ్యాచ్.. ఫ్రీగా ఎలా చూడొచ్చొ తెలుసా?
2022 ప్రపంచకప్ లో భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంది. ఆ మ్యాచ్ ముగిసిన తరువాత భారత జట్టు మొత్తం పాక్ ప్లేయర్ల వద్దకు వెళ్లి వారిని పలకరించినట్లుగా చెప్పింది. తమ ప్లేయర్లతో కలిసి భారత ప్లేయర్లు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికి తెలుసునని చెప్పింది. అయినప్పటికి మైదానంలో ఉండే.. 20-22 మంది ప్లేయర్లు అంతా ఓ కుటుంబం లాంటి వారమేనని చెప్పుకొచ్చింది. ఇక వన్డే ప్రపంచకప్ ఆడడం అనేది దాదాపు ప్రతి ప్లేయర్ కల అని, విజేతగా నిలిచేందుకు తాము శాయశక్తుల కృషి చేస్తామని తెలిపింది.
భారత్, పాక్ జట్లు ఇప్పటి వరకు వన్డేల్లో 11 సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. అన్ని మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలుపొందింది. దీనిపై పాక్ కెప్టెన్ సనా మాట్లాడుతూ.. రికార్డులు ఉండేవే బద్దలు కొట్టడానికి అని చెప్పింది. రికార్డులు చూసి భారత్ పై పాక్ ఎప్పటికి గెలవదు అనేది వాస్తవం కాదన్నారు. మంచి క్రికెట్ ఆడితే తప్పకుండా విజయం సాధించవచ్చునని చెప్పింది. కాబట్టి గత రికార్డుల గురించి తాము పట్టించుకోమని, నాణ్యమైన క్రికెట్ ఆడేందుకే ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చింది.