Pink Ball test Australia all out 337 in first innings
పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియాకు భారీ ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 87.3 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు 157 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (140; 141 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగాడు. మార్నస్ లబుషేన్ (64) రాణించాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ లు చెరో నాలుగు వికెట్లు తీశారు. నితీశ్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్‌లు చెరో వికెట్ సాధించాడు. కాగా.. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.
ఓవర్ నైట్ స్కోరు 86/1 రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 251 పరుగులు జోడించి మిగిలిన తొమ్మిది వికెట్లు కోల్పోయింది. మ్యాచ్ ఆరంభమైన కాసేపటికే ఓవర్‌నైట్ స్కోరుకు మరో పరుగు మాత్రమే జోడించిన నాథన్ మెక్‌స్వీనీ (39) ఔట్ అయ్యాడు. కాసేపటికే స్మిత్ (2) కూడా పెవిలియన్‌కు చేరుకున్నాడు. వీరిద్దరిని బుమ్రానే ఔట్ చేశాడు. మరో ఓవర్‌నైట్ బ్యాటర్ లబుషేన్‌తో జతకలిసిన ట్రావిస్ హెడ్ భారత బౌలర్లపైకి ఎదురుదాడికి దిగాడు.
నాలుగో వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి ప్రమాదకరంగా మారిన ఈ జోడిని లబుషేన్‌ను ఔట్ చేయడం ద్వారా నితీశ్ రెడ్డి విడగొట్టాడు. లబుషేన్ ఔటైనా కూడా హెడ్ ఏ మాత్రం తగ్గలేదు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు తనదైన శైలిలో పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలో 111 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. పింక్ బాల్ టెస్టుల్లో ఇది అతడికి మూడో సెంచరీ కావడం విశేషం.
సెంచరీ చేసిన తరువాత కూడా అతడు అదే జోరును కొనసాగించాడు. ఆఖరికి మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతడు ఔటైన తరువాత ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సేపు పట్టలేదు.
AUSTRALIA BOWLED OUT FOR 337.
– Lead of 157 runs with Australia, Bumrah and Siraj picked 4 each. A challenge ahead for Indian batters under lights. 🇮🇳 pic.twitter.com/Kfwg4nDjWa
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 7, 2024