RCB vs GT : ఆర్సీబీ vs జీటీ మ్యాచ్ కు వరుణ గండం.. అదే జరిగితే.. నేరుగా ఫైనల్‌కు వెళ్లేదెవరంటే..!
RCB vs GT : నేడు ధర్మశాల వేధికగా జరగనున్న ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ కు వరుణ గండం ఉందంటున్నారు.
Rain Threat RCB vs GT Who Goes Through If Is Washed Out
RCB vs GT : ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ దశకు చేరుకుంది. క్వాలిఫయర్ 1లో భాగంగా ఫైనల్ బెర్త్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఆద్యంతం ఆసక్తి రేపుతున్న ఈ మ్యాచ్.. నేడు అనగా మంగళవారం రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్‌కి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండగా.. ఆసక్తికర వార్త ఒకటి తెరమీదకు వచ్చింది. ఒకవేళ నేడు వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే.. ఆర్సీబీ, జీటీల్లో ఏ జట్టు ఫైనల్‌కి చేరుకుంటుంది అనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం నేడు ధర్మశాలలో వర్షం కురిసేందుకు 80 శాతం అవకాశం ఉంది అంటున్నారు. అప్పుడు పరిస్థితి ఏంటంటే…
నేడు ధర్మశాల వేదికగా ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ జరుగుతున్న తరుణంలో వర్షం కురిసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అదే జరిగి ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే.. పాయింట్ల పట్టికలో మెరుగైన నెట్ రన్-రేట్ కారణంగా జీటీ (GT) కంటే ముందున్న ఆర్సీబీ (RCB) నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ లేదా క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లకు ఎలాంటి రిజర్వ్ డే లేదు. అందువల్ల, లీగ్ స్టేజ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టుకే ఒకవేళ మ్యాచ్ రద్దయితే నేరుగా ఫైనల్‌కి చేరుకునే అవకాశం లభించనుంది.
*క్రికెట్ ప్రపంచంలో విషాదం.. బెంగళూరులో మ్యాచ్ ఆడుతూ గుండెపోటుతో క్రికెటర్ మృతి..
ఐపీఎల్ (IPL) ఫార్మాట్ ప్రకారం, పాయింట్ల పట్టికలో తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్లు క్వాలిఫైయర్ 1కు అర్హత సాధిస్తాయి. ఈ రెండు జట్లకు మధ్య జరిగే మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో.. అదే నేరుగా ఫైనల్‌కి చేరుకుంటుంది. అలానే ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టుకు క్వాలిఫైయర్ 2 ద్వారా మరో అవకాశం లభిస్తుంది.
ఇదిలా ఉంటే ఐపీఎల్ నిబంధనల ప్రకారం, వర్షం కారణంగా పూర్తి స్థాయిలో మ్యాచ్ నిర్వహించడం అసాధ్యం అయితే.. అప్పుడు మ్యాచ్ విజేతను నిర్ణయించడానికి అధికారులు పూర్తి ఇన్నింగ్స్‌లను పక్కన పెట్టి కేవలం ఒక ‘సూపర్ ఓవర్’ మాత్రమే నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది.
పాయింట్ల పట్టికలో ఆర్సీబీ, జీటీ చెరో 18 పాయింట్లతో వరుసగా మొదటి, రెండు స్థానాల్లో నిలిచాయి. ఈ రెండు జట్ల మధ్య వ్యత్యాసం.. కేవలం నెట్ రన్ రేట్ మాత్రమే. ఈ సీజన్లో వీరిద్దరి హెడ్-టు-హెడ్ (head-to-head) రికార్డు 1-1తో సమానంగా ఉండగా, ఓవరాల్‌గా 4-4తో సమంగా ఉంది.
*కేఎల్ రాహుల్ నువ్వు మామూలోడివి కాదయ్యా.. ఐపీఎల్లో ‘సిక్సర్ల కింగ్’ వి..
ఇదిలా ఉంటే టేబుల్ టాపర్‌గా ఉన్న ఆర్సీబీ ఈ సీజన్లో మొత్తం ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోగా.. వాటిల్లో ఒకటి జీటీ చేతిలోనే కావడం గమనార్హం. ఆ మ్యాచ్‌లో జీటీ బలమైన బౌలింగ్ విభాగం ఆర్సీబీని ముప్పతిప్పలు పెట్టింది. అయితే, డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఆర్సీబీ ఆ తర్వాత జరిగిన రివర్స్ ఫిక్చర్‌లో జీటీపై విజయం సాధించి.. గతంలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.
ప్రస్తుతం ఆర్సీబీ, జీటీ రెండు ఫ్రాంచైజీలు తమ రెండో ఐపీఎల్ టైటిల్‌ను గెలవాలనే కసితో ఉన్నాయి. ప్రస్తుత ఛాంపియన్ అయిన ఆర్సీబీ వరుసగా రెండోసారి కప్పు కొట్టాలని చూస్తుండగా, 2022 అరంగేట్రం సీజన్లో కప్పు గెలిచిన జీటీ.. ఈసారి మళ్లీ ఆ వైభవాన్ని దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది.
