Ranji Trophy Rohit Sharma batting woes continue in red ball cricket
గత కొన్నాళ్లుగా టెస్టుల్లో రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్ ఆడి ఫామ్ అందుకోవాలని హిట్‌మ్యాన్ భావించాడు. ఈ క్రమంలో 10 ఏళ్ల తరువాత రంజీ ట్రోఫీలో అడుగుపెట్టాడు. ముంబై తరుపున బరిలోకి దిగాడు. అయితే.. ఇక్కడ కూడా తన పేలవ ఫామ్‌ను రోహిత్ శర్మ కంటిన్యూ చేశాడు. గురువారం జమ్ముకశ్మీర్‌తో ప్రారంభమైన మ్యాచ్‌లో 19 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఓపెనర్‌గా వచ్చాడు. 31 ఏళ్ల ఉమర్ నజీర్ మీర్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అతడి స్ట్రైక్ రేటు 15 మాత్రమే కావడం గమనార్హం. అతడి కంటే ముందు యశస్వి జైస్వాల్ 8 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు.
అజింక్యా రహానే సారథ్యంలో ముంబై బరిలోకి దిగింది. యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మలతో పాటు రహానే (12), శ్రేయస్ అయ్యర్ (11), శివమ్ దూబె (0)లు విఫలం కావడంతో ముంబై 21 ఓవర్లలో 78 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం శార్దూల్ ఠాకూర్ (21), తనుష్ కోటియన్ (14)లు క్రీజులో ఉన్నారు. జమ్ము బౌలర్లలో ఉమర్ నజీర్ మీర్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
ప్రమాదంలో రోహిత్ టెస్ట్ కెరీర్..
ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా ఆసీస్‌తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ రాణించలేదు. అతడు త్వరగా ఔట్ కావడంతో మిగిలిన బ్యాటర్ల పై ఒత్తిడి పెరిగింది. బ్యాటర్‌గానే కాకుండా కెప్టెన్ గానూ ఈ సిరీస్‌లో రోహిత్ దారుణంగా విఫలం అయ్యాడు. ఫలితంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భారత్ చేజారింది.
మొత్తంగా గత 9 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శర్మ అత్యధిక స్కోరు 20 పరుగులు కూడా లేదు అంటే అతడు ఎంతలా విఫలం అవుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇక గత 15 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ కేవలం ఒకే ఒక సారి అర్థశతకాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలో అతడి టెస్టు కెరీర్ ప్రమాదంలో పడింది. ఇప్పుడు దేశవాళీలో విఫలం అయితే ఇక సుదీర్ఘఫార్మాట్‌లో రోహిత్ ను చూడడం ఇక కష్టమే. కనీసం మిగిలిన మ్యాచుల్లోనైనా సత్తా చాటి రోహిత్ శర్మ ఫామ్ అందుకుంటాడో లేదో చూడాలి మరీ
Rohit Sharma dismissed for 3 in 19 balls. pic.twitter.com/ooEFvMfWjI
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 23, 2025