ఇప్పటికే తొలి టెస్టులో టీమిండియా ఓటమి.. బుమ్రా నెక్ట్స్ మ్యాచ్ ఆడకుంటే ఎలా? రవిశాస్త్రి సంచలన విశ్లేషణ
ఆ మ్యాచ్‌కు ముందు వచ్చే రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది.

లీడ్స్ టెస్టులో ఓటమితో టీమిండియా ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశారు.
వెన్ను నొప్పి కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన భారత బౌలర్ బుమ్రా ఐపీఎల్-2025తో రీఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లాండ్ సిరీస్‌కు బుమ్రాను బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే, ఈ సిరీస్‌లో బుమ్రా 3 టెస్టులు మాత్రమే ఆడతాడని ఇప్పటికే సెలెక్టర్లు చెప్పారు. బుమ్రా కూడా తాను 3 మ్యాచులే ఆడతానని అన్నాడు. ఇప్పటికే మొదటి టెస్టులో బుమ్రా ఆడాడు. రెండో టెస్టు వచ్చేనెల 2 నుంచి ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో రవిశాస్త్రి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బుమ్రా నిర్ణయం జట్టుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వివరించారు. “బుమ్రా మూడు టెస్టులు మాత్రమే ఆడతానని చెప్పడం సరైందే. అయితే, అతను ఏ మూడు టెస్టులు ఆడతాడు? అన్నదే ప్రశ్న. నా అభిప్రాయం ప్రకారం అతను ప్రతిష్ఠాత్మకమైన లార్డ్స్ టెస్టులో (మూడో టెస్టు) కచ్చితంగా ఆడాలనుకుంటాడు.
కాబట్టి, ఆ మ్యాచ్‌కు ముందు వచ్చే రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. మళ్లీ లార్డ్స్ టెస్టు తర్వాత ఓ మ్యాచులో బుమ్రా ఆడడు. కానీ ఈ ప్లాన్‌లో ఒక ప్రమాదం ఉంది. ఒకవేళ రెండో టెస్టు మ్యాచులో ఓడి, భారత జట్టు 2-0 తేడాతో సిరీస్‌లో వెనుకబడితే, అప్పుడు బుమ్రాను పక్కన పెట్టే సాహసం చేయగలరా? అదే అసలైన సమస్య. రెండో టెస్టులో బుమ్రా ఆడాలి” అని శాస్త్రి చెప్పారు.
లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో చివరి రోజు 371 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక భారత్ ఓడిపోవడంపై శాస్త్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఇంగ్లాండ్ జట్టులో కీలక పేసర్లు గాయాలతో బాధపడుతున్నారు. ఇది మనకు ఒక సువర్ణావకాశం. కానీ మనం దాన్ని చేజార్చుకున్నాం. ఇప్పుడు పతనాన్ని ఎదుర్కొంటున్నాం. ఈ పరిస్థితి నుంచి జట్టు వెంటనే బయటపడాలి” అని ఆయన అన్నారు.
“ఇప్పుడు మీరు నిజమైన ‘కౌంటర్ పంచ్’ ఇవ్వాలి. అది కూడా తర్వాతి టెస్టులోనే జరగాలి. ఒక్కసారి సిరీస్‌లో వెనుకబడితే, మళ్లీ పుంజుకోవడానికి సమయం ఉండదు. ఈ విషయాన్ని ఆటగాళ్లు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది” అని శాస్త్రి స్పష్టం చేశారు.
ఇప్పటికే తొలి టెస్టు ఓటమితో భారత జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంది. బుమ్రా రెండు టెస్టు మ్యాచుల్లో ఆడొద్దని నిర్ణయం తీసుకోవడం టీమిండియాను మరింత ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. రవిశాస్త్రి చెప్పినట్లు రాబోయే టెస్టులో పుంజుకోకపోతే సిరీస్ ఆశలు గల్లంతయ్యే ప్రమాదం ఉంది.