సూర్యకుమార్ యాదవ్‌కు సర్జరీ సక్సెస్.. ఎప్పుడు తిరిగొస్తాడో చెప్పేశాడు.. ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
సూర్యకుమార్‌కు గత మూడేళ్లలో జరిగిన మూడో శస్త్రచికిత్స ఇది.

టీమిండియా టీ20 కెప్టెన్, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఆపరేషన్ చేయించుకున్నాడు. స్పోర్ట్స్ హెర్నియా సమస్యతో బాధపడుతున్న అతడికి జర్మనీలో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఈ విషయాన్ని సూర్యకుమార్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. త్వరలోనే మళ్లీ మైదానంలోకి అడుగుపెడతానని అన్నాడు.
“అందరికీ నమస్కారం. కుడి పొత్తికడుపు భాగంలో స్పోర్ట్స్ హర్నియాకు సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ఇప్పుడు కోలుకుంటున్నాను. మీ అందరి ప్రార్థనలకు ధన్యవాదాలు. త్వరలోనే మిమ్మల్ని మైదానంలో కలుస్తాను” అని సూర్యకుమార్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
ఐపీఎల్‌లో అద్భుత ఫామ్
ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 సీజన్‌లో సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఫామ్‌తో చెలరేగిపోయాడు. ముంబై ఇండియన్స్‌ను ప్లేఆఫ్స్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు.
ఈ సీజన్‌లో ఏకంగా 717 పరుగులు సాధించి, ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో నిలిచాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత ఒకే ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున 600+ పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శనకు గాను ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ అవార్డును గెలుచుకున్నాడు.
నెక్ట్స్ ప్లాన్ ఏంటి?
సూర్యకుమార్‌కు గత మూడేళ్లలో జరిగిన మూడో శస్త్రచికిత్స ఇది. 2013లో చీలమండలానికి, 2014లో స్పోర్ట్స్ హెర్నియాకు, ఇప్పుడు మళ్లీ స్పోర్ట్స్ హెర్నియాకు సర్జరీ చేయించుకున్నాడు. ఐపీఎల్ తర్వాత నిపుణుల సలహా మేరకు జర్మనీలో సర్జరీ చేయించుకున్నాడు.
రెండు వారాల విశ్రాంతి తర్వాత.. సూర్య బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో తన రిహాబిలిటేషన్ ప్రారంభిస్తాడు. భారత జట్టు తదుపరి సిరీస్ ఆగస్టులో బంగ్లాదేశ్‌తో జరగనుంది. అక్కడ మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.
సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్ నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధించి, మళ్లీ జట్టులోకి వస్తాడని అభిమానులు, మేనేజ్‌మెంట్ ఆశిస్తున్నారు. సూర్య వీలైనంత త్వరగా కోలుకుని, మళ్లీ తన ‘360 డిగ్రీ’ షాట్లతో మైదానంలో అలరించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.