అదిరిందయ్యా రింకు సింగ్‌.. మొన్న మహిళా ఎంపీతో నిశ్చితార్థం.. ఇప్పుడు ప్రభుత్వ అధికారిగా ఉద్యోగం.. లక్ అంటే ఇట్లుండాలి..

గ్యాస్ సిలిండర్ల డెలివరీ నుంచి... టీమిండియా వరకు...

అదిరిందయ్యా రింకు సింగ్‌.. మొన్న మహిళా ఎంపీతో నిశ్చితార్థం.. ఇప్పుడు ప్రభుత్వ అధికారిగా ఉద్యోగం.. లక్ అంటే ఇట్లుండాలి..

Updated On : June 26, 2025 / 4:34 PM IST

భారత క్రికెటర్, ఐపీఎల్ హీరో రింకు సింగ్ జీవితంలో వరుసగా రెండు కీలక ఘట్టాలు చోటుచేసుకున్నాయి. ఇటీవలే సమాజ్‌వాది పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో రింకూ సింగ్‌కు నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో అతడు ఉద్యోగాన్ని కూడా పొందబోతున్నాడు. క్రీడా మైదానంలో సిక్సర్లతో హోరెత్తించిన రింకు.. ఇకపై ప్రభుత్వ అధికారిగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు.

అంతర్జాతీయ స్థాయిలో దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చిన క్రీడాకారులను గౌరవించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం “ఇంటర్నేషనల్ మెడల్ విన్నర్స్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ రూల్స్ – 2022″ను ప్రవేశపెట్టింది. ఈ నిబంధనల ప్రకారం రింకు సింగ్‌ను జిల్లా ప్రాథమిక విద్యాధికారిగా నియమిస్తూ ప్రాథమిక విద్యా డైరెక్టరేట్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. క్రీడా రంగానికి రింకు సింగ్ అందించిన సేవలకు ప్రభుత్వం అందించిన గొప్ప గౌరవంగా దీన్ని చెప్పుకోవచ్చు.

గ్యాస్ సిలిండర్ల డెలివరీ నుంచి… టీమిండియా వరకు…
రింకు సింగ్ ప్రయాణం ఎంతో మంది యువతకు ఆదర్శం. 1997లో అలీగఢ్‌లో జన్మించిన రింకుది ఒక నిరుపేద కుటుంబం. అతని తండ్రి గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసేవారు. చిన్నప్పుడు రింకు కూడా తండ్రికి సాయం చేస్తూ గ్యాస్ సిలిండర్లు మోసేవాడు.

పేదరికం అడ్డుపడినా రింకు క్రికెట్‌ను వదల్లేదు. 2023 ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరఫున చివరి ఓవర్లో 5 సిక్సర్లు కొట్టి జట్టుకు అద్భుత విజయాన్ని అందించి, రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా హీరో అయ్యాడు.

ఆ ప్రదర్శనతో భారత టీ20 జట్టులో స్థానం సంపాదించాడు. ఇప్పటివరకు భారత్ తరఫున 2 వన్డేలు, 33 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2024లో KKR ఐపీఎల్ టైటిల్ గెలవడంలోనూ కీలక పాత్ర పోషించాడు.

వ్యక్తిగత జీవితంలోనూ కొత్త అధ్యాయం
రింకు సింగ్ ఇటీవలే తన చిరకాల స్నేహితురాలు ప్రియా సరోజ్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ప్రియా సరోజ్ ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లా మచిలీషహర్ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాది పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. 26 ఏళ్ల వయసులోనే ఆమె లోక్‌సభలో అడుగుపెట్టారు.

క్రీడారంగంలో సంచలనాలు సృష్టిస్తూ, ప్రేమించిన అమ్మాయిని జీవిత భాగస్వామిగా చేసుకోబోతూ, ఇప్పుడు ప్రభుత్వ సేవలోకి అడుగుపెడుతున్న రింకు సింగ్ ప్రస్థానం నిజంగా స్ఫూర్తిదాయకం.