అరుదైన రికార్డుకు అడుగు దూరంలో అశ్విన్.. ఈరోజు జస్ట్ మిస్..

టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డుకు మరింత చేరువయ్యాడు. మరొక వికెట్ తీస్తే టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు.

Ravichandran Ashwin just one wicket far away to complete 500 test wickets

Ravichandran Ashwin: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించేందుకు ఒక వికెట్ దూరంలో నిలిచాడు. మరో వికెట్ తీస్తే టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకుంటాడు. విశాఖపట్నంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో అశ్విన్ 3 వికెట్లు పడగొట్టాడు. మరో వికెట్ కోసం చాలా శ్రమించినా ఫలితం దక్కలేదు. సెకండ్ ఇన్నింగ్స్‌లో 18 ఓవర్లు వేసి 72 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లు బౌలింగ్ చేశాడు.

అశ్విన్ మరొక్క వికెట్ పడగొడితే భారత్ తరపున వేగంగా 500 వికెట్లు పడగొట్టిన రికార్డు అతడి సొంతమవుతుంది. ఇంతకుముందు ఈ రికార్డు అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. కుంబ్లే 105 మ్యాచుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అశ్విన్ ఇప్పటివరకు 97 టెస్టులు ఆడాడు. శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ 87 మ్యాచుల్లోనే ఈ ఘనత సాధించి టాప్‌లో ఉన్నాడు. మరొక్క వికెట్ తీస్తే అశ్విన్ మురళీధరన్ తర్వాతి స్థానంలో నిలుస్తాడు. ఆస్ట్రేలియా దివంగత స్పిన్నర్ షేన్ వార్న్ 108 మ్యాచుల్లో 500 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.

97 టెస్టులు.. 3271 పరుగులు 
37 ఏళ్ల రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో టాప్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. తన బౌలింగ్‌తో ఎన్నోసార్లు జట్టుకు విజయాలు అందించిన అతడు.. బ్యాటర్‌గానూ రాణించాడు. 97 టెస్టులు ఆడిన అశ్విన్ 3271 పరుగులు సాధించాడు. ఇందుల్లో 5 సెంచరీలు, 14 అర్ధసెంచరీలు ఉండడం విశేషం. టెస్టుల్లో అతడు సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు 124. కాగా, రాజ్‌కోట్‌లో ఈనెల 15న ప్రారంభమయ్యే మూడో టెస్ట్ మ్యాచ్‌లో అశ్విన్ 500 వికెట్ల మైలురాయిని అందుకుంటాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Also Read: శ్రేయస్ అయ్యర్ అద్భుత ఫీల్డింగ్.. డైరెక్ట్ హిట్‌తో రనౌట్

చంద్రశేఖర్ రికార్డ్ బ్రేక్
టెస్టుల్లో ఇంగ్లండ్‌పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అశ్విన్ తాజాగా రికార్డుకెక్కాడు. 45 ఏళ్లుగా భగవత్ చంద్రశేఖర్ పేరిట ఉన్న రికార్డును అతడు బ్రేక్ చేశాడు. ఇంగ్లీషు జట్టుపై అశ్విన్ ఇప్పటివరకు 96 వికెట్లు తీయగా, చంద్రశేఖర్ 95 వికెట్లు పడగొట్టాడు. అనిల్ కుంబ్లే (92), బిషన్ సింగ్ బేడీ(85), కపిల్ దేవ్(85), ఇషాంత్ శర్మ(67) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.