Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆఖరి లీగ్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. లక్నోలోని ఎకానా స్టేడియంలో మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సాధించి విజయంతో సీజన్‌ను ముగించాలని లక్నో భావిస్తోంది. మరోవైపు ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరుకున్న ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో టాప్-2లో చోటు సంపాదించుకోవడమే లక్ష్యంగా ఆడనుంది.
ఈ కీలక మ్యాచ్ ముందు ఆర్‌సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లని పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మరో 24 పరుగులు చేస్తే ఆర్‌సీబీ తరుపున 9 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు.
ఐపీఎల్ ఆరంభం నుంచి కోహ్లీ ఆర్‌సీబీ తరుపుననే ఆడుతున్నాడు. ఐపీఎల్‌తో పాటు ఛాంపియన్స్ లీగ్ లలో ఆర్‌సీబీ తరుపున 270 ఇన్నింగ్స్‌ల్లో బరిలోకి దిగిన కోహ్లీ 8976 పరుగులు సాధించాడు. ఇందులో ఛాంపియన్స్ లీగ్ టీ20ల్లో 424 పరుగులు చేయగా ఐపీఎల్‌లో 256 ఇన్నింగ్స్‌ల్లో 8552 పరుగులు చేశాడు.
డేవిడ్ వార్నర్ రికార్డు బ్రేక్..
ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్లుగా డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ లు కొనసాగుతున్నారు. వీరిద్దరు చెరో 62 సార్లు ఐపీఎల్లో అర్థశతకాలు బాదారు. లక్నో మ్యాచ్‌లో కోహ్లీ హాఫ్ సెంచరీ చేస్తే వార్నర్ ను అధిగమిస్తాడు. ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కుతాడు. వీరిద్దరి తరువాత ఈ జాబితాలో 46 హాఫ్ సెంచరీలతో రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు.
ఈ సీజన్‌లో కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. 12 మ్యాచ్‌ల్లో 548 పరుగులు సాధించాడు.
ఆర్‌సీబీ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 13 లీగ్ మ్యాచ్‌లు ఆడింది. 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ప్రస్తుతం ఆర్‌సీబీ ఖాతాలో 17 పాయింట్లు ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ +0.255గా ఉంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.
లక్నో పై విజయం సాధిస్తే అప్పుడు ఆర్‌సీబీ టాప్-2లో నిలిచి క్వాలిఫయర్ -1కి అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడిపోతే అప్పుడు గుజరాత్ టైటాన్స్ టాప్-2తో క్వాలిఫయర్-1లో అడుగుపెడుతుంది. సోమవారం ముంబై పై విజయం సాధించి పంజాబ్ కింగ్స్ క్వాలిఫయర్-1లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.