IPL 2023: డుప్లెసిస్‌కు జ‌రిమానా, హెల్మెట్ విసిరికొట్టిన ఆవేశ్‌ఖాన్‌కు మంద‌లింపు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్(RCB), లక్నో సూపర్ జెయింట్స్(LSG) జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ఆఖ‌రి బంతికి ల‌క్నో గెలుపొందింది. చివ‌రి వ‌ర‌కు విజ‌యం ఇరు జ‌ట్ల‌తో దోబూచులాడిన ఈ మ్యాచ్‌లో ప‌లు ఆస్తక్తిక‌ర ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి.

IPL 2023: డుప్లెసిస్‌కు జ‌రిమానా, హెల్మెట్ విసిరికొట్టిన ఆవేశ్‌ఖాన్‌కు మంద‌లింపు

RCB vs LSG

Updated On : April 11, 2023 / 3:07 PM IST

IPL 2023: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో మ్యాచ్‌లు ఉత్కంఠ భ‌రితంగా సాగుతున్నాయి. అభిమానుల‌కు కావాల్సినంత మ‌జాను అందిస్తున్నాయి. బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో సోమ‌వారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్(RCB), లక్నో సూపర్ జెయింట్స్(LSG) జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ఆఖ‌రి బంతికి ల‌క్నో గెలుపొందింది. చివ‌రి వ‌ర‌కు విజ‌యం ఇరు జ‌ట్ల‌తో దోబూచులాడిన ఈ మ్యాచ్‌లో ప‌లు ఆస్తక్తిక‌ర ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి.

హెల్మెట్ విసిరిన ఆవేశ్‌ఖాన్‌

ఆఖ‌రి బంతికి ల‌క్నో విజ‌యానికి ఒక్క ప‌రుగు అవ‌స‌రం కాగా.. హ‌ర్ష‌ల్ వేసిన బంతిని ట‌చ్ చేయ‌డంలో ఆవేష్‌ఖాన్(Avesh Khan) విఫ‌లం అయ్యాడు. అయిన‌ప్ప‌టికి బై రూపంలో ప‌రుగు తీసి జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు. గెలుపును సెల‌బ్రేట్ చేసుకునే క్ర‌మంలో ఆవేశ్ ఖాన్ త‌న హెల్మెట్ తీసి నేల‌కు వేసి కొట్టాడు. అయితే.. ఈ చ‌ర్య ఐపీఎల్ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ఉల్ల‌ఘించిన‌ట్లే. దీంతో మ్యాచ్ రిఫ‌రీ లెవెల్ 1 తప్పిదం కింద ఆవేశ్ ఖాన్‌ను మంద‌లించి వ‌దిలివేశాడు. ఆవేశ్ త‌న త‌ప్పును ఒప్పుకున్నట్లు స‌మాచారం.

ఓట‌మి బాధ‌లో ఉన్న ఆర్‌సీబీకి షాక్‌

అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న ఆర్‌సీబీ జ‌ట్టుకు మ‌రో షాక్ త‌గిలింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేట్(నిర్ణీత స‌మ‌యంలోగా ఓవ‌ర్లు పూర్తి చేయ‌డంలో విఫ‌లం కావ‌డం) కార‌ణంగా బెంగ‌ళూరు జ‌ట్టు కెప్టెన్‌కు జ‌రిమానా విధించారు. డుప్లెసిస్‌(Faf du Plessis)కు రూ.12ల‌క్ష‌ల ఫైన్ విధించారు. అస‌లే త‌మ జ‌ట్టు ఓడిపోయింద‌నే బాధ‌లో ఉన్న బెంగ‌ళూరు అభిమానులు త‌మ జ‌ట్టు కెప్టెన్‌కు జ‌రిమానా ప‌డ‌డంతో మ‌రింత చిరాకు ప‌డుతున్నారు. ఇలాంటి బౌలింగ్‌తో ట్రోఫీ నెగ్గ‌డం ఎలా అని ప్ర‌శ్నిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ జ‌ట్టు ఫాఫ్ డుప్లెసిస్(79; 44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), విరాట్ కోహ్లి(61; 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), గ్లెన్ మాక్స్‌వెల్(59; 29 బంతుల్లో 3ఫోర్లు, 6 సిక్స‌ర్లు) లు రాణించ‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 212 ప‌రుగులు చేసింది. అనంత‌రం నికోల‌స్ పూరన్‌(62; 19 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స‌ర్లు), స్టోయినిస్‌(65; 30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) దంచికొట్ట‌డంతో ల‌క్ష్యాన్ని ల‌క్నో 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది.